Home > Politics - Gossip
పళనిస్వామి వర్గం సేఫ్ : కత్తి దూశారంతే!

తమిళనాడు రాకీయాలు కత్తి దూసే వరకు వెళ్లాయి. టీటీవీ దినకరన్ కు మద్దతిస్తూ.. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న క్యాంపులో భాగంగా రిసార్టులో విలాసాల్లో గడుపుతునన్ 18మంది అన్నా డీఎంకే ఎమ్మెల్యేల మీద తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటువేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే చీఫ్ విప్ ఫిర్యాదు మేరకు వారి ఎమ్మెల్యే పదవులపై వేటు పడింది. ఈ కత్తివేటుతో.. పళనిస్వామి ప్రభుత్వం సేఫ్ పొజిషన్ కు చేరుకున్నట్లు లెక్క. అవిశ్వాస పరీక్ష వంటి గండం ఎదురైనా సరే  వారు గట్టెక్కే అవకాశం ఉంది. 

టీటీవీ దినకరన్.. పార్టీలోని 18మంది ఎమ్మెల్యేలను తన గ్రూపుగా చూపిస్తూ.. ప్రభుత్వాన్ని కూల్చడానికి తన శక్తివంచన లేకుండా అన్ని ప్రయత్నాలూ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తూ తన ఎమ్మెల్యేలతో గవర్నరు విద్యాసాగర్ రావును కలిసి లేఖలు ఇప్పించారు. ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రాష్ట్రపతిని కూడా కలిశారు. ఈలోగా.. దినకరన్ ను పార్టీ నుంచి జనరల్ కౌన్సిల్ సమావేశం బహిష్కరించడం జరిగింది. ప్రభుత్వాన్ని కూలుస్తా అంటూ ఆరోజు కూడా తొడకొట్టారు.

ఈలోగా గతంలో విశ్వాసపరీక్ష జరిగి ఆరునెలల గడువు పూర్తి కాకపోయినప్పటికీ.. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడానికి అనుమతించాలంటూ డీఎంకే తరఫున స్టాలిన్ కూడా గవర్నరును కోరారు. అప్పటికి దినకరన్ వర్గం 18మంది ఎమ్మెల్యేలు లేకుండా అయితే ప్రభుత్వానికి ఇబ్బంది ఎదురయ్యేది. ఇప్పుడు ఆ స్థానాల్లో ఉప ఎన్నిక నిర్వహించి.. ప్రభుత్వానికి అవసరమైన మెజారిటీని సంపాదించుకోవడానికి వారు ప్రయత్నిస్తారు. 

ఎటూ మరోవైపు ఆర్కే నగర్ ఉప ఎన్నికను డిసెంబరు 31లోగా నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. కొంచెం అటు ఇటుగా అంతే త్వరగా ఈ 18స్థానాలకు కూడా ఉప ఎన్నిక పెట్టేయాలని ప్రభుత్వం ఈసీని కోరే అవకాశం ఉంది. అదే జరిగితే గనుక.. ఆ 18స్థానాల ఉప ఎన్నికలు అన్నా డీఎంకే లో ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాలకు ప్రజల మద్దతు విశ్వాసం ఎటువైపు ఉన్నదనడానికి నిదర్శనంగా నిలుస్తాయి.

అమ్మ ఇమేజి ఎవరికి అనుకూలంగా పనిచేస్తుందో కూడా అర్థం అవుతుంది. మొత్తానికి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలకు కేంద్రంలోని భాజపానుంచి ఆశీస్సులైతే పుష్కలంగానే ఉన్నాయి. పైగా స్థానికంగా.. కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రస్తుతానికి గండం లేని పరిస్థితి సృష్టించుకున్నారు. అన్నాడీఎంకే పై హక్కులను కోరుకుంటున్న ఈ వర్గం అసలు బల నిరూపణ అసెంబ్లీలో కంటె, ఈ 18స్థానాల ఉప ఎన్నికలోనే జరుగుతుందని తెలుసుకోవాలి.