Advertisement


Home > Politics - Gossip
పన్నీరూ.. అసలేం కావాలి సారూ.!

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు.. అంతలోనే, తనను బలవంతంగా ఆ పదవి నుంచి తొలగించారన్నాడు.. అమ్మ సమాధి సాక్షిగా, అమ్మ (జయలలిత) ఆశయాల్ని నెరవేరుస్తానన్నాడు.. ఎట్టి పరిస్థితుల్లోనూ శశికళను ముఖ్యమంత్రిని కానివ్వబోనన్నాడు. ఓ విషయంలో సక్సెస్‌ అయ్యాడు, అదే శశికళను ముఖ్యమంత్రిని కానివ్వకపోవడం.! 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం.. ఇప్పుడెవరికీ అర్థం కావడంలేదు. 'ఒట్టి తింగరోడు..' అనేలా తమిళనాడు రాజకీయాల్లో 'ప్రత్యేకమైన గుర్తింపు' తెచ్చుకున్న పన్నీర్‌ సెల్వం, అమ్మ గైర్హాజరీలో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాల్సి వచ్చినప్పుడు, అమ్మ ఫొటోని ఆమె కుర్చీలో పెట్టి, పరిపాలించిన విషయం విదితమే. పన్నీర్‌ సెల్వం బలమేంటో, ఇప్పుడు తీరిగ్గా ముఖ్యమంత్రి పళనిసామికి తెలిసొచ్చింది. రాజీ బేరానికి సిద్ధమయ్యారాయన. 

ఓపెన్‌ సీక్రెట్‌ ఏంటంటే, పోగొట్టుకున్న సీఎం పదవిని పన్నీర్‌ సెల్వం కోరుకుంటున్నారు. కానీ, ఆ విషయాన్ని ఆయన ఒప్పుకోవడంలేదు. పార్టీ అధ్యక్ష పదవి కోరుకోవట్లేదంటారు, ముఖ్యమంత్రి పదవీ అవసరం లేదంటారు. కానీ, అమ్మ ఆశయం నెరవేరాలంటారు. అమ్మ ఆశయమేంటి, తన గైర్హాజరీలో పన్నీర్‌ సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలనే.! ఇదే పన్నీర్‌ సెల్వం వర్గం వాదన. భలే కామెడీగా వుంది కదా.! 

తాజా గందరగోళమేంటంటే, 'ప్రభుత్వం నా చేతుల్లో వుండాలి.. అన్నాడీఎంకే పార్టీ, కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో చేరాలి. కేంద్రంలో మంత్రి పదవులు సంపాదించాలి..' అన్నది పన్నీర్‌ సెల్వం డిమాండ్‌ అట. అసలు పన్నీర్‌ సెల్వం ఏం కోరుకుంటున్నారో ఎవరికీ అర్థం కావడంలేదాయె. దటీజ్‌ పన్నీర్‌ సెల్వం. 

ఇంత గందరగోళం వున్నాసరే, పన్నీర్‌ సెల్వం చెప్పినట్టే తమిళనాడులో రాజకీయం రోజుకొకలా మారుతోంది. ఈ సందట్లో ప్రతిపక్షం డీఎంకే సోయ లేకుండా పడి వుండడం గమనార్హం.