Advertisement


Home > Politics - Gossip
పరిటాల శ్రీరామ్‌ పెళ్లి.. ఇలా టర్న్‌ అయిపోతోందేంటి!

అసలు గుట్టు వీడింది. పరిటాల శ్రీరామ్‌ పెళ్లిలో తెలుగుదేశం పార్టీ వాళ్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అంతలా రాచమర్యాలు ఎందుకు చేశారో.. ఇప్పుడిప్పుడే గుట్టు వీడింది. తెలుగుదేశం పార్టీ వాళ్లు.. ఒకప్పుడు తీవ్రమైన స్థాయిలో విరుచుకుపడిన కేసీఆర్‌ను ఇప్పుడెందుకు నెత్తిన పెట్టుకున్నారో, అసలు పరిటాల ఇంటి పెళ్లికి కేసీఆర్‌కు ఎందుకు ఆహ్వానం అందింది, ఆహ్వానం అందగానే కేసీఆర్‌ అక్కడ ఎందుకు వాలారు, అలా వచ్చిన కేసీఆర్‌ను తెలుగుదేశం వాళ్లు అంతలా ఎందుకు ఆదరించారు.. అంటే, మార్క్స్‌ చెప్పిన సిద్ధాంతాన్ని ప్రస్తావించుకోవాలి.

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నాడు మార్క్స్‌. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏపీ విభాగానికి, తెలంగాణ ముఖ్యమంత్రికి ఉన్న బంధం కూడా అలాంటిదే.. అని కుండబద్ధలు కొట్టాడు తెలంగాణ టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి.

తెలంగాణలో ఇప్పుడైతే ఏపీకి, సీమకు సంబంధించినది కాకపోవచ్చు. కానీ.. ఇక్కడి రాజకీయ నేతలకు మాత్రం హైదరాబాద్‌తో వీడని బంధముంది. చంద్రబాబు అమరావతి, విజయవాడ, వెలగపూడి అంటూ ఎన్ని చెప్పినా.. టీడీపీ లీడర్ల వ్యాపార సామ్రాజ్యాలు అన్నీ హైదరాబాద్‌లోనే విస్తరించి ఉన్నాయి. వాటికి యథారీతిన కేసీఆర్‌ ప్రభుత్వం నుంచి చక్కటి సహకారం అందుతోంది. ఎక్కడ తెలంగాణ వస్తే.. హైదరాబాద్‌లో తమ వ్యాపారాలకు భంగం కలుగుతుందో అని భయపడిన వాళ్లే.. ఇప్పుడు కేసీఆర్‌కు అత్యంత ఆప్తులు అయిపోయారు. ఆ వైనాన్ని తెలంగాణ ప్రజానీకం చాన్నాళ్ల నుంచినే గమనిస్తోంది!

ఇప్పుడు.. సీమాంధ్రులకు అర్థం అవుతున్న వైనం ఏమిటంటే.. ఏపీ నేతలు తెలంగాణ సీఎంతో చాలా సన్నిహిత సంబంధాలు మెయింటెయిన్‌ చేస్తున్నారనేది. లోగుట్లు అన్నీ తెలిసిన రేవంత్‌ రెడ్డే ఈ విషయాలను చెబుతున్నాడు. రాయలసీమ రాజకీయాల్లో ముఖ్యనేతలుగా వెలుగిపోతున్న మంత్రి పరిటాల సునీత తనయుడి వ్యాపార సామ్రాజ్యానికి తెలంగాణ ముఖ్యమంత్రి నుంచినే సహకారం అందుతోందని, దానివెనుక ఫైనాన్షియల్‌ డీల్స్‌ ఉన్నాయని రేవంత్‌ రెడ్డి చెప్పాడు.

అలాగే మరో సీమ టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ వారసుల వ్యాపారాలు కూడా తెలంగాణ అధికార పార్టీ సహకారంతో చక్కగా సాగిపోతున్నాయని.. ఈ వ్యాపార, ఆర్థిక సంబంధాలే.. పరిటాల శ్రీరామ్‌ పెళ్లికి కేసీఆర్‌ రావడానికి కారణం, కేసీఆర్‌కు తెలుగుదేశం పార్టీ వాళ్లు ఆ రేంజ్‌ సత్కారాలు చేయడానికి కారణం.. అని రేవంత్‌ రెడ్డి కుండబద్ధలు కొట్టాడు.

ఈ మాటలు.. ఏ వైకాపా వాళ్లో చెప్పి ఉంటే పట్టించుకోకూడదనే అనుకుందాం. కానీ.. స్వయంగా తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంటే.. ఈ విషయాలను ఇంతగా చెబుతున్నారంటే.. ఇకనైనా ఫైనాన్సియల్‌ బంధాలను అర్తం చేసుకోవచ్చు. అయినా.. పరిటాల శ్రీరామ్‌ పెళ్లి రాజకీయంగా ఇలాంటి మార్పులకు కారణం అవుతుందని ఎవరూ ఊహించలేదు. కేసీఆర్‌ను పెళ్లికి ఆహ్వానించేసి.. సన్నిహిత సంబంధాలు అనే క్రెడిట్‌ను సొంతం చేసుకోవాలని టీడీపీ వాళ్లు లెక్కలేస్తే.. అది మిస్‌ఫైర్‌ అయ్యి.. వ్యవహారం ఇక్కడి వరకూ వచ్చింది!