Advertisement


Home > Politics - Gossip
కులాన్ని కెలుకుతున్న పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ ఎందుకు రాజకీయం చేస్తున్నాడనే ప్రశ్నల జోలికి వెళ్లడం ఇప్పుడు సందర్భం కాదు. ప్రజల కోసం సమాజం కోసం ఏదైనా చేయాలని... తనకు చిన్నప్పటినుంచి చాలా కోరికగా ఉండేదని ఇప్పటికే ఆయన చాలా సార్లు చెప్పారు. పైగా పవన్ కల్యాణ్ అంటే చాలా క్రేజీ టాపిక్ గనుక.. ఆయన ఏం మాట్లాడినా దాని మీద పుంఖాను పుంఖాలుగా విశ్లేషణలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ కు సిద్ధం అయిపోతాయి.

అయితే.. ఒక చిన్న పాయింట్ మిస్సవుతోందేమో అనిపిస్తోంది. ఆయన ప్రజలకోసం పోరాడదలచుకున్నారు.. పోలవరం మీద ప్రశ్నించదలచుకున్నారు. శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఇవన్నీ ప్రతిపక్షాలు చాలా రోజులుగా చేస్తున్నవే. పవన్ కల్యాణ్ కూడా క్రియాశీల ప్రతిపక్ష పాత్రలోకి వచ్చినందుకు సంతోషం.

అయితే వీటన్నింటికీ భిన్నంగా ఆయన ‘కులాన్ని’ ఎందుకు కెలుక్కుంటున్నారు. ఈ సంగతి మాత్రం అర్థం కావడం లేదు.

‘‘తనకు కులాన్ని ఆపాదిస్తూ ఎవరైనా ఆరోపణలు చేసినా.. పత్రికల్లో కథనాలు రాసినా.. ఆయా సంస్థల్లో కులాలకు ఇస్తున్న ప్రాధాన్యం గురించి ఆధారాలతో బయటపెడతానని’’ ఆయన హెచ్చరించారు. ఇదంతా బహుశా ఆయన ఒక దినపత్రికలో వచ్చిన రాతల మీద ఆయన ఆవేదన అని అనుకోవాలేమో.  పవన్ చుట్టూతా కాపు యువత మాత్రమే పోగవుతోందనే వార్త గురించి ఆయన కడుపుమంటను ఇలా వెళ్లగక్కినట్లుగా కథనాలు వస్తున్నాయి.

అయినా ఒక పార్టీకి నాయకుడిగా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేయాలని అనుకుంటున్న వ్యక్తిగా ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ ఆ మాత్రం సంయమనం లేకుండా వ్యవహరిస్తే ఎలాగ? ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత...  అనేక కోణాల్లోంచి విమర్శలు రావడం సహజం. రాజకీయాలు- కులం అనేవి అవిభాజ్యమైన అంశాలుగా మారిపోయిన ఈ రోజుల్లో కులంతో ముడిపెట్టి చేసే వ్యాఖ్యలు విమర్శలుగా కూడా పరిగణన పొందడం లేదు. సాధారణ వ్యాఖ్యలుగానే ఉంటున్నాయి.

అలాంటి వాటికి పవన్ ఉడుక్కుంటే నష్టపోయేది ఆయనే. పైగా ఆయనకు కాపు కులంతో ముడిపెట్టి కథనాలు వస్తే.. అవి అబద్ధాలని ఆయన నిరూపించుకోవాలి.. తన చుట్టూ ఉన్నది కాపులు మాత్రమే కాదని నిరూపించాలి... తన పార్టీ నిర్మాణం (అలాంటిది ఉంటే) కులం ప్రాతిపదికగా కాకుండా ఎలా సాగిందో చాటి చెప్పాలి. తన పార్టీలో నిర్ణయాలు తీసుకునే , సలహాలు చెప్పే స్థాయిలో ఉన్నది ఎవరో .. వారి ప్రాతిపదిక ఏమిటో ఏ కులాల వారో.. ఆయన తన పార్టీ నిర్మాణం గురించి శ్వేతపత్రం విడుదల చేసి.. అప్పుడు తన కులరహిత స్వచ్ఛత ను చాటుకోవాలి.

అదేమీ చేయకుండా.. నాకు కులం ముడిపెట్టారంటే.. మీ పత్రికాసంస్థల్లో కులాల ప్రయారిటీ గురించి ఆధారాలతో సహా బయటపెడతా.. అని బీరాలు పలకడం సబబుగా లేదు. పైగా రాజకీయాల్లోకి వచ్చిన తరవాత.. కొన్ని పత్రికలు లేదా సంస్థలు కొన్ని కులాలకు ఇచ్చే ప్రయారిటీ ని తప్పుపడితే.. ఆ సంస్థలు చేస్తున్న తప్పును ఎత్తి చూపించినందుకు ఆ కులాన్ని మొత్తంగా పవన్ దూరం చేసుకున్నట్లు అవుతుంది.

ఇంత చిన్న లాజిక్ ను పవన్ కల్యాణ్.. సారీ, ఆయనకు సలహాలు ఇచ్చేవాళ్లు ఎందుకు మిస్సవుతున్నారు? ఇది అర్థం కాని సంగతి.