Home > Politics - Gossip
పవన్ కల్యాణ్ మురిసిపోతున్నారో లేదో?

అనగనగా పవన్ కల్యాణ్ కు ఓ ధర్మసందేహం వచ్చి ఉండాలి. అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉన్నదంటూ తాను కూడా సభల్లో డిమాండు చేశాడు గనుక.. ఇప్పుడు కేబినెట్ ఆమోదం ద్వారా సదరు చట్టబద్ధత వచ్చేసింది గనుక.. సహజంగా ఆయన మురిసిపోవాలి. అయితే ప్యాకేజీకి చట్టబద్ధత వచ్చినందుకు మురిసిపోతే గనుక.. అక్కడితో తాను పదేపదే వల్లె వేస్తున్న ప్రత్యేక హోదా డిమాండుకు తన చేతులతో తానే సమాధి కట్టేసినట్టు అవుతుంది. మరి అలాంటప్పుడు మొత్తం వ్యవహారం.. ‘‘హోదా కోసం పోరాటం’’ అనే పునాదుల మీద తాను నిర్మంచుకున్న క్రేజ్ మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. ఇలాంటి సంక్లిష్ట సమయంలో చట్టబద్ధత వచ్చినందుకు తాను మురిసిపోవాలా? వద్దా? అని పవన్ కల్యాణ్ సందేహంలో పడినట్లుగా ఉంది. 

పవన్ కల్యాణ్ తన పార్టీని జూన్ నుంచి నిర్మించేయబోతున్నానని దూకుడుగానే ప్రకటించి ఉండవచ్చు. తమ పార్టీ ప్రస్తుతం ఎన్డీయే లో భాగస్వామి కాదని కూడా తెగేసి చెప్పి ఉండవచ్చు. కానీ ఆయన డిమాండ్లు, పోరాటాలు..., అటువైపు కేంద్ర ప్రభుత్వం నుంచి వాటిపట్ల స్పందిస్తున్న తీరు అన్నీ గమనిస్తే స్నేహపూర్వక పోరాటాలే వారి మధ్య నడుస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎప్పటినుంచో ఉన్న సమస్యల గురించి పవన్ డిమాండ్లు చేయడం, ఆ వెంటనే కేంద్రం కాస్త స్పందించి చర్యలు తీసుకోవడం... పవన్ హీరోయిజం ఒక గ్రేడ్ పెరగడం జరుగుతూ ఉంది. ఇదంతా ఉభయులూ కలిసి ఆడుతున్న నాటకం అని విమర్శిస్తున్న వారు కూడా లేకపోలేదు.

ఇలాంటి విమర్శలు సహేతుకంగానే పుట్టాయి. ఎందుకంటే.. ప్రత్యేక హోదా వచ్చేవరకు మడమ తిప్పేది లేదు అని ధాటిగా ప్రకటించిన పవన్ కల్యాణ్ తర్వాతి రోజుల్లో కాస్త మెత్త బడ్డారు. ప్యాకేజీ ప్రకటించారు. కానీ దానికి కూడా చట్టబద్ధత ఇవ్వడం లేదు... అంటూ సభల్లో కాస్త నర్మగర్భంగా తన వైఖరి మార్చుకుంటున్న సంగతి బయటపెట్టారు. మరి ఇప్పుడు చట్టబద్ధత వచ్చేసింది కదా... పవన్ కల్యాణ్ మురిసిపోవాలి కదా...! తాను అడిగిన వెంటనే కేంద్రం స్పందించేస్తున్నదని అంటూ సంబరపడి ట్వీట్లు చేయాలి కదా...! ఇప్పటిదాకా అదేమీ జరగలేదు. చూడబోతే.. దీనికి సంతోషం వ్యక్తం చేస్తే హోదా గురించి తాను రాజీపడినట్లు ప్రజలకు సంకేతం వెళుతుందని ఆయన భయపడుతున్నట్లుంది. అందుకే చట్టబద్ధత గురించి నోరు మెదపడం లేదని పలువురు భావిస్తున్నారు.