Home > Politics - Gossip
పవన్ కల్యాణ్ లో ఆత్మస్థైర్యం కనిపించడం లేదా?

హీరో పవన్ కల్యాణ్ లో ఆత్మస్థైర్యం కనిపించడం లేదా? ఒకవైపు ఆయన అభిమానులంతా.. 2019ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి తెలుగుదేశం పార్టీ ఆయనతో పొత్తులు పెట్టుకుంటే గనుక.. ఆ కూటమి విజయం సాధిస్తుందని అంటూ ఉంటే.. ఆశలు పెంచుకుంటూ ఉంటే.. నాయకుడికి ఉండాల్సిన కనీస లక్షణం ఆత్మస్థైర్యం కూడా పవన్ కల్యాణ్ లో కనిపించలేదని అనడం చాలా మందికి ఆగ్రహం కలిగించవచ్చు.

కానీ ఈ మాట అంటున్నది కూడా ఏదో రాజకీ నాయకుడు, లేదా దారినపోయే దానయ్య కాదు. పవన్ తో చాలా చిత్రాల్లో నటించిన, నటుడిగా మాత్రమే కాకుండా సామాజికంగా కూడా తనకంటూ సొంత గుర్తింపు కలిగిఉన్న ప్రకాష్ రాజ్. ఆయన ఎందుకలా అంటున్నాడో తెలుసుకోవాలని ఉందా?

ప్రకాష్ రాజ్ అంటే.. కేవలం దేశవ్యాప్త గుర్తింపు ఉన్న విలక్షణ నటుడు మాత్రమే కాదు. సామాజికంగా సేవాభిలాష ఉన్న వ్యక్తిగా కూడా చాలా మందికి తెలుసు. ఆయన కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని తన సొంత డబ్బుతో అక్కడ గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అనేక సామాజిక సమస్యల మీద ఆయన తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టినట్టు వెల్లడిస్తూ కొన్ని సందర్భాల్లో వివాదాలు రేగినా పట్టించుకోకుండా చెలరేగుతుంటారు.

అలాంటి ప్రకాష్ రాజ్ ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. సినీ నటులు ఎవరు పార్టీ పెట్టినా సరే.. ఓటు వేయవద్దని అంటున్నారు. వారు ఎవరైనా సరే.. రజనీకాంత్, కమల్ హాసన్, ఉపేంద్ర, పవన్ కల్యాణ్ ఏ భాషా నటులు పార్టీ పెట్టినా ఓటువేయవద్దంటూ తాను ప్రచారం చేస్తానని ప్రకాష్ రాజ్ చెప్పడం విశేషం. ఆయా నటుల మేనిఫెస్టోలు, ఆత్మస్థైర్యం గమనించి మాత్రమే వారికి ఓటు వేయాలట.

అంతే తప్ప... నటుడిగా ఉండే క్రేజ్ ను బట్టి ఓటు వేయకూడదుట. పైన చెప్పిన నలుగురు హీరోలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాననడంలో ప్రకాష్ రాజ్ ఉద్దేశం ఏంలో తెలియడం లేదు. ఆయన సిద్ధాంతం ప్రకారమే.. పవన్ కు ఆత్మస్థైర్యం లేదని ఆయన అనుకుంటున్నారా? అని పలువురు తర్కించుకుంటున్నారు.

అయినా మేనిఫెస్టోలు చూసి ఓటు వేయడం కొరివితో తల గోక్కోవడమే! అ దరి మేనిఫెస్టోలు చాలా గొప్పగానే ఉంటాయి. మరి ఆ సంగతి ప్రకాష్ రాజ్ కు తెలుసో లేదో??