Advertisement


Home > Politics - Gossip
పవ​'​నిజాలు​'​: గుండు కొట్టింది ఎవరు?

గుమ్మడికాయ పోయింది. ఇప్పుడు కాదు.. 14-15ఏళ్ల కిందటే అది పోయింది. కానీ టీడీపీ నేతలు మాత్రం ఇప్పుడు భుజాలు తడుముకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే గుమ్మడికాయ పోయిందని ఎవరూ అనలేదు. వాళ్ల నేతలే మళ్లీ గుర్తుచేసుకొని మరీ భుజాలు తడుముకుంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే "పవన్ గుండు"పై తెలుగుదేశంలో జరుగుతున్న తంతు ఇది.

పసుపు నేతలకు "పవన్ గుండు" ఇప్పుడో ప్రచారాస్త్రం అయిపోయింది. మీడియా ముందుకు రావాలనుకునే ప్రతి నేత పవన్ గుండు అంటున్నాడు.. భుజాలు తడుముకుంటున్నాడు. (అలాంటి వాళ్లను మీడియా పట్టించుకోవట్లేదనుకోండి, అది వేరే విషయం.) అయితే ఇప్పుడు స్వయంగా ఓ మంత్రి దీనిపై స్పందించారు. అది కూడా మరెవరో కాదు, గతంలో ఎవరైతే పవన్ కల్యాణ్ కు గుండు కొట్టించారని అంటున్నారో, స్వయంగా ఆ వ్యక్తి భార్య, ఏపీ మంత్రి పరిటాల సునీత.

"పవన్ కల్యాణ్ కూడా చెప్పారు కదా. మా ఆయన పవన్ కు గుండు కొట్టించారనే విషయం నిజం కాదు. పవన్ కు మా ఆయన ఎందుకు గుండు కొట్టిస్తారు. ఆ గుండు కథతో మా ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. పవన్ కూడా బాగా చెప్పారు. పరిటాల రవిని నేను అస్సలు చూడలేదు. అలాంటాయన నాకెలా గుండు కొడతారాని పవన్ అన్నారు. అది నిజమే." పవన్ గుండు కథకు మంత్రి సునీత కంక్లూజన్ ఇది.

ఈ గుండు కథను స్వయంగా పవన్ తెరపైకి తీసుకొచ్చారు. అప్పట్లో అలా జరిగింది, ఇలా జరిగిందంటూ ఏవేవో మాట్లాడారు. అది జనాలకు సగం అర్థమైంది, సగం అర్థంకాలేదు. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించడం స్టార్ట్ చేసే సరికి విషయం మళ్లీ మొదటికి వచ్చింది. అసలు పవన్ కు ఎవరు గుండు కొట్టించారనే టాపిక్ మళ్లీ మొదలైంది.

తనకు బోర్ కొట్టి పవనే గుండు కొట్టించుకొని ఉంటారు (పరిటాల రవితో మాత్రం కాదులేండి). లేదంటే మరెవరైనా కొట్టి ఉండాలి. వాళ్లను కూడా పవన్ కడుపులో పెట్టుకొని గుర్తుంచుకుంటూ ఉండాలి. తన ప్రసంగాల్లో చెబుతున్నట్టు.. వచ్చే ఎన్నికల్లో  ఆ "గుండు బ్యాచ్" కు కూడా బుద్ధి చెబుతాడేమో. 

ప్రస్తుతానికైతే పవన్ కు తలనిండా జుట్టు ఉంది. ఆయన మరోసారి గుండు కొట్టించుకునే వరకు, ఈ పాత గుండు వ్యవహారం మీడియాలో నలుగుతూనే ఉంటుందేమో.