Advertisement


Home > Politics - Gossip
పవన్ : పాదయాత్ర కలర్ ఇచ్చి, వాహనయాత్ర!

పవన్ కల్యాణ్ కూడా ఒక యాత్ర చేయడానికి సిద్ధం అవుతున్నారు. అయితే అది పాదయాత్ర రూపంలో నడిచి రాష్ట్రమంతా తిరగాలా... లేదా ప్రత్యేక వాహనంలో వాహన యాత్ర లాగా అక్కడక్కడా ఆగుతూ... పర్యటించాలా అనే విషయంలో ఇంకా ఒక క్లారిటీకి రాలేదు. యాత్ర రూపం ఎలాగైనా ఉండొచ్చు గానీ.. మొత్తానికి యాత్ర మాత్రం చేసి తీరాల్సిందే అనే అభిప్రాయానికి మాత్రం వచ్చినట్లుగా కనిపిస్తోంది.

కానీ పార్టీలోని అభిజ్ఞ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి పాదయాత్ర చేయడానికి మొగ్గు చూపుతున్నట్లుగా ముందు బిల్డప్ ఇస్తే చాలునని.. ఆ తర్వాత వాహన యాత్రకు మాత్రం పరిమితం అవుదాం అని.. పోలీసు అనుమతులు.. శాంతి భద్రతల సమస్య ఇత్యాది కారణాలను సాకులుగా చూపించవచ్చునని పవన్ కల్యాణ్ వ్యూహకర్తలు భావిస్తున్నట్లుగా సమాచారం. 

మొత్తానికి రాజకీయంగా పునాదులు సుస్థిరం చేసుకోవడానికి యాత్రామార్గం ఒక్కటే సులువైనదని పవన్ కల్యాణ్ కూడా నమ్ముతున్నట్లుగా కనిపిస్తోంది. కాకపోతే.. ఆయన యాత్రకు ఎంచుకున్న సమయం, సందర్భమే కాస్త వివాదాస్పదంగా మారుతోంది. వైఎస్ జగన్మోహనరెడ్డి నవంబరు 2వ తేదీనుంచి పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు.

తొలుత అక్టోబరు 26న ప్రారంభించాలనుకున్న ఆయన పాదయాత్ర నవంబరు 2కు మారింది. మధ్యలో ప్రతి శుక్రవారం కోర్టు హాజరీలకు మినహాయుంపు వచ్చినా... రాకపోయినా కూడా.. పాదయాత్ర చేయడం, ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం అనేది విధిగా చేసి తీరాల్సిందే అనే కృతనిశ్చయంతో జగన్ ఉన్నట్లుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

అయితే పవన్ కల్యాణ్ కూడా ఇంచుమించుగా సరిగ్గా అదే సమయంలో తాను కూడా యాత్ర చేయడానికి షెడ్యూలు నిర్ణయించుకున్నారు. తేడా ఏంటంటే.. జగన్ రూట్ మ్యాప్ తో సహా సిద్ధం చేసుకుంటే.. పవన్ ఇంకా ఏమీ డిసైడ్ చేసుకోకుండానే.. నవంబరు మొదటి వారంలో యాత్రకు వెళ్లబోతున్నట్లుగా మాత్రం ప్రకటిస్తున్నారు. జగన్ యాత్రతో పవన్ యాత్ర ఓవర్‌ల్యాప్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

లేదా, జగన్ పాదయాత్ర కంటె.. తాను చేపడుతున్న యాత్రలకే ఎక్కువ ప్రజాస్పందన వస్తోందని.. ఆ రకంగా జగన్ కంటె తనకే జనంలో ఎక్కువగా ఆదరణ ఉన్నదనీ ఏకకాలంలో రెండు పనులు చక్కబెట్టుకోవడం లక్ష్యంగా పవన్ కల్యాణ్ జగన్ యాత్ర నిర్వహిస్తున్న సమయంలోనే తాను కూడా యాత్ర చేయదలచుకుంటున్నారా అనే సందేహాలు కూడా పలువురికి కలుగుతున్నాయి. 

లేకపోతే.. సంక్రాంతికి విడుదల చేయదలచుకుంటున్న సినిమాను అక్టోబరు చివరిలోగా పూర్తి చేసేయాల్సినంత అగత్యం ఉంటుందా అని పలువురు అనుకుంటున్నారు. మొత్తానికి సినిమా పని పూర్తయ్యాకే యాత్ర ఉంటుందని.. పాదయాత్ర అనే ప్రచారం కూడా ముమ్మరంగా సాగించి వాహన యాత్ర చేస్తారని తెలుస్తోంది.