Advertisement


Home > Politics - Gossip
‘పాత’ దోపిడీ మేలు అంటున్న రాజకీయ పార్టీలు!

రాజకీయం అంటేనే అడ్డంగా దోచుకోవడానికి ఓ రాజమార్గం అన్నట్లుగా మన దేశంలో రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రజల ఆదరణ చూరగొని ఎన్నికల్లో గెలిచి.. పదవుల్లోకి రావాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు.. నలుగురిని పోగేయగలిగి ఒక రాజకీయ పార్టీని రిజిస్టరు చేస్తే చాలు. ఇక ఆ పార్టీ పేరు మీద చందాలు పోగు చేసుకుంటూ.. జీవితాంతమూ బతికిపోవచ్చు అనే అభిప్రాయం కూడా పలువురిలో బలపడుతోంది. అంటే ‘రాజకీయం’ అనే పదమే ఆదాయమార్గంగా మారిపోతున్న రోజులుగా ప్రస్తుత సమాజం నడుస్తోంది.

ఇలా రాజకీయ పార్టీలు సమాజంలోని వివిధ వర్గాల నుంచి చందాలు తీసుకోవడం అనేది ఒక పెద్ద క్విడ్ ప్రోకో అవినీతి కుంభకోణమే అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే గుర్తు తెలియని వ్యక్తుల పేర్లతో పార్టీలకు మాత్రం.. కోట్లకు కోట్ల రూపాయల విరాళాలు నగదు రూపేణా వస్తాయి. అలా వచ్చినట్లుగా వారు ఎన్నికల సంఘానికి రికార్డులు సమర్పిస్తారు. కానీ, ఆ నగదు విరాళం ఇచ్చిన వారెవ్వరో పార్టీ అధినేతలకు తెలుసు. వారికి మేలు చేయడానికి ఆ పార్టీ తమ శక్తి వంచన లేకుండా  కృషి చేస్తూ ఉంటుంది. ఇలాంటి క్షుద్ర రాజకీయం నడుస్తోంది.

అందుకే రాజకీయ పార్టీల విరాళాల్లో ఒక పారదర్శకత తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లుగా మోడీ సర్కారు చెబుతోంది. తాము పరిశుద్ధాత్ములం అని టముకు వేసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నం ఇది. ఆన్ లైన్ బదిలీలు, చెక్కులు, బాండ్ల రూపంలో మాత్రమే విరాళాలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి జైట్లీ అంటున్నారు. ఇంకా ఎవరైనా మెరుగైన సూచనలు ఇచ్చినా కూడా స్వీకరిస్తాం అని జైట్లీ అంటున్నారు.

అయితే తమ ప్రయత్నాలను పార్టీలు వ్యతిరేకిస్తుంటాయని.. నగదు రూపంలో తీసుకునే ప్రస్తుత విధానమే కొనసాగాలని కోరుకుంటున్నాయని జైట్లీ అంటున్నారు. అంటే నిజాయితీకి పెద్దపీట వేసి తాము సంస్కరణలు తేవాలనుకుంటోంటే.. ఇతర పార్టీలు అడ్డుపడుతున్నాయనే సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. పాత దోపిడీ పద్ధతే కొనసాగాలని పార్టీలు కోరుకోవడంలో వింతేమీ లేదు.

భాజపా అంత చిత్తశుద్ధి గల పార్టీ అయితే.. తమ పార్టీకి సంబంధించినంత వరకు నగదురూపేణా ఒక్కరూపాయి కూడా తీసుకోబోము.. అని ప్రకటించవచ్చు కదా..! సమస్తం చెక్, బాండ్, ట్రాన్స్ ఫర్ పద్ధతుల్లోనే తమ పార్టీకి తీసుకోవచ్చు కదా..! అనే సందేహం ప్రజలకు కలుగుతోంది. వారు అలా చేయరు. ఇతరులను నిందిస్తూ ఉంటారు తప్ప.. నగదు పద్ధతిని రద్దు చేయరు నగదు విరాళం ఇచ్చే వ్యక్తి ఆధార్ కార్డు నెంబరు, పాన్ నెంబరు కూడా విధిగా ఇవ్వాల్సి ఉంటుందనే నిబంధన లాంటి విజత చేర్చరు అని జనం అనుకుంటున్నారు.