Home > Politics - Gossip
ప్రచారం ఒక విధంగా.... ఫలితాలు మరోవిధంగా..!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాలు ప్రభుత్వాలకు, అధికార పార్టీలకు వ్యతిరేకంగా తీవ్రంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారం ఎంత తీవ్రంగా ఉందంటే ప్రతిపక్షాలనేవి అసలు ఉండకూడదని అధికార పార్టీలు అనుకునేంతవరకు వెళ్లింది. రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాల వ్యతిరేక ప్రచారంతో అధికార పార్టీలు, ప్రభుత్వాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలపై కోర్టుల్లో కేసులు పడుతున్నాయి.

అందుకే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ప్రతిపక్షాలు అభివృద్ధికి అడ్డుగా ఉన్నాయని అదే పనిగా ఆగ్రహిస్తున్నారు. తేడా ఏమిటంటే తెలంగాణలో టిఆర్‌ఎస్‌ సర్కారుపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయిగాని మీడియా సర్కారుకు వ్యతిరేకంగా పనిచేయడానికి భయపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా అధినేత జగన్‌కు చెందిన 'సాక్షి' మీడియా (పత్రిక, ఛానెల్‌) ప్రభుత్వంపై పోరాడుతోంది.

ఇంత చేస్తున్నా రెండు రాష్ట్రాల్లోనూ ప్రజాభిప్రాయం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా లేదని వివిధ ఎన్నికల ద్వారా రుజువైంది. ఏపీలో మొన్నీమధ్య నంద్యాల, కాకినాడ ఎన్నికలు జరిగాయిగాని, తెలంగాణలో కేసీఆర్‌ అధికారంలోకి వచ్చినప్పటినుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు సహా అనేక రకాల ఎన్నికలు జరిగాయి. ఈ అన్ని ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలు ఉధృతంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేశాయి.

ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని గట్టిగా చెప్పాయి. కాని ఏ ఒక్క ఎన్నికలోనూ అధికార పార్టీకి దెబ్బ తగల్లేదు. ఎన్నికల ఫలితాలు చూస్తే అధికార పార్టీ అంతకంతకూ బలపడినట్లు కనబడుతోంది. ఏపీలోనూ పరిస్థితి ఇలాగే ఉంది.

ఇక్కడ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక తొలిగా జరిగిన ఎన్నికలు నంద్యాల, కాకినాడ. ఈ ఎన్నికలు జరిగేవరకూ రాజధాని నిర్మాణం సహా పలు అంశాలపై వ్యతిరేక ప్రచారం తీవ్రంగా జరిగింది. అయినప్పటికీ రెండు చోట్లా భారీ మెజారిటీతో టిడిపి విజయం సాధించింది. రెండు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలకు అధికార పార్టీల విజయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

ప్రజల్లో ప్రభుత్వాల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని ఎలా నిర్ధారణకు వచ్చాయి? ప్రతిపక్షాలు ప్రజలను ఎందుకు నమ్మించలేకపోతున్నాయి? ప్రతిపక్షాల ప్రచారమంతా అబద్ధం కాదు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు చాలా విషయాల్లో విఫలమయ్యాయి. కొన్ని వైఫల్యాలు కళ్ల ఎదురుగా స్పష్టంగా కనబడుతున్నాయి. న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నాయి.

అయినప్పటికీ ఎన్నికల్లో అపజయం మూటగట్టుకునే పరిస్థితి రాలేదు. సాధారణ ఎన్నికలనాటికి తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు జరగకపోవచ్చు. అనూహ్య ఘటనలు జరిగితే ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. ఆంధ్రాలో కొన్ని మున్సిపల్‌ కార్పొరేషన్‌లకు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కాబట్టి టిడిపి, వైకాపా బలాబలాలు తేల్చుకోవడానికి ఇంకా అవకాశముంది.

రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాల ఆశలన్నీ సాధారణ ఎన్నికల మీదనే ఉన్నాయి. ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఆలోచనలు, అభిప్రాయాలు ఒకలా ఉంటాయని, సాధారణ ఎన్నికల్లో మరోలా ఉంటాయని, ఆ ఎన్నికల్లో అధికార పార్టీలపై ప్రజా వ్యతిరేకత బయటపడుతుందని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు.

సాధారణ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తాన్ని ప్రభావితం చేసే అంశాలు తెర ముందుకొస్తాయని, అప్పటి రాజకీయ సమీకరణాలు, పొత్తులు తదితర కారణాలవల్ల తమకు అడ్వాంటేజ్‌ ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం కూడగట్టేందుకు సాగుతున్న ప్రయత్నాలు ఇంకా ఉధృతమవుతాయి. ఈ ప్రయత్నాలకు ఫలితం కనబడుతుందా?