Advertisement


Home > Politics - Gossip
ప్రత్యేక హోదా 'కాక' రేగుతోందిగానీ..

మరుగున పడిపోయిన ప్రత్యేక హోదా అంశానికి మళ్ళీ కాస్త 'ఊపు' వచ్చినట్లే కన్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ముట్టడి పేరుతో వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చిన విషయం విదితమే. ప్రతిపక్షం వైఎస్సార్సీపీ కూడా, ఈ 'ప్రత్యేక హోదా పోరు'కి మద్దతు పలికింది. 

'ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు.. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌ హక్కు..' అంటూ కొత్త నినాదంతో ఈసారి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వామపక్షాలు అంటున్నాయి. అయితే, షరామామూలుగానే, ఈ ఆందోళనల్ని అణచివేయడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 'శాంతి భద్రతల సమస్య'ని తెరపైకి తెస్తోంది. 'శాంతియుత నిరసనలైతే ఫర్వాలేదుగానీ..' అంటూ పోలీసు శాఖ సన్నాయి నొక్కులు నొక్కడంలోనే, ఉద్యమాన్ని ఏ స్థాయిలో అణచివేయాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి వుందో సుస్పష్టమవుతోందిక్కడ. 

గతంలో విశాఖ వేదికగా, ప్రత్యేక హోదా కోసం ఉద్యమం ఉధృతమయ్యేలా కన్పించింది. అప్పట్లో, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా యువత నడుం బిగించింది. కానీ, ఏం లాభం.? ఉద్యమం నీరుగారిపోయింది. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ని, విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోనే నిలువరించింది పోలీస్‌ శాఖ. అంతకుముందు వరకూ హడావిడి చేసిన పవన్‌కళ్యాణ్‌, సోషల్‌ మీడియాకే పరిమితమయ్యారప్పట్లో. 

అయితే, ఈసారి ఉద్యమానికి కాస్తంత 'ఊపు' అయితే వచ్చే అవకాశాల్లేకపోలేదు. ఎందుకంటే, రాజధాని అమరావతిలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలు కావడం, అదీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రత్యేక హోదా కాక రేగడం.. ఇవన్నీ, అధికార పార్టీలో కొంత ఆందోళన కలిగిస్తున్న మాట వాస్తవం. అన్నిటికీ మించి, మూడున్నరేళ్ళు గడిచినా, ప్రత్యేక హోదాని పాతరేసిన కేంద్రం, కనీసం ప్రత్యేక ప్యాకేజీపైనా ఎటూ తేల్చకపోవడంతో అధికార టీడీపీ సైతం, ఈసారి ప్రత్యేక హోదా ఉద్యమంపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.