Home > Politics - Gossip
అగ్రపూజ అమ్మకే : భలే ఉన్నదీ ఎత్తుగడ !

తమిళనాడులో ద్రవిడ రాజకీయాలు ఇప్పుడు రసకందాయంలో పడ్డాయి. అధికార పార్టీ అన్నా డీఎంకే రాజకీయాలకు ఇప్పుడు నిర్వచనం మారిపోయింది. అవి కేవలం అమ్మ రాజకీయాలు- పోటీగా చిన్నమ్మ రాజకీయాలుగా రూపు సంతరించుకున్నాయి.

అయితే.. తాజా పరిణామాల్లో తమ ప్రభుత్వం మైనారిటీలో పడే ప్రమాదం పొంచి ఉన్నదని స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు కలిసి మంగళవారం తీసుకున్న కొన్ని నిర్ణయాలు సంచలనాత్మకమైనవి. ఈ నిర్ణయాల్లో చిన్నమ్మను పూర్తిగా వెలి వేస్తూనే.. అసలు సిసలు అమ్మకు అగ్రపూజను కొనసాగిస్తూ... చాలా తెలివైన ఎత్తుగడను వేశారు.

తమిళనాడులో అన్నాడీఎంకేకు ఆ పార్టీ బతికి ఉన్నంత కాలమూ.. (మరణించిన) జయలలిత దానికి ప్రధాన కార్యదర్శిగానే ఉంటారని... ఆమె స్థానాన్ని మరెవ్వరితోనూ భర్తీ చేయబోవడం లేదని పళనిస్వామి, పన్నీర్ సెల్వం ప్రకటించేశారు.

అంటే శశికళను తొలగించిన మాత్రాన.. చిన్నమ్మ గానీ ఆమె వర్గీయులు గానీ.. ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్న, గోతులు తవ్వుతున్న దినకరన్ గానీ.. ఎలాంటి ‘అమ్మ’ సెంటిమెంటును ప్రదర్శించే అవకాశం లేకుండా.. వారి ముందరి కాళ్లకు బంధం వేశారు. అమ్మ పురట్చితలైవి జయలలితకు అగ్రపీఠం ఇవ్వదలచుకున్నాం గనుకనే.. ఆమె స్థానాన్ని మరొకరితో భర్తీ చేయదలచుకోలేదు గనుకనే.. తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా పీపీ కూటమి (పళనిస్వామి-పన్నీర్ సెల్వం కూటమి) అమ్మ అభిమానులకు సంకేతాలు ఇచ్చినట్లుగా అయింది. 

అన్నాడీఎంకే అంటేనే జయలలిత మినహా మరేమీ లేదన్నట్లుగా ఆమె జీవించి ఉన్నంత కాలమూ పార్టీ నిర్వహణ సాగింది. నిజానికి ఆమె ఇమేజిని వాడుకోకుండా.. ప్రజల్లో ఆ పార్టీ నెగ్గడం కూడా కష్టమే. అందుకే పార్టీపై ఆమె హోదాకు శాశ్వతత్వం కల్పిస్తున్నట్లుగా పీపీ వర్గం ఓ సంకేతం ఇచ్చింది.

గతంలో మారడోనా, సచిన్ వంటి వాళ్లు రిటైర్ అయినప్పుడు వారు వాడిన 10వ నెంబరు జెర్సీ మరెవ్వరూ వాడకుండా.. వారి గౌరవార్థం వదిలేయాలంటూ కొన్ని వాదనలు వినిపించాయి. అదే తరహాలో.. జయలలిత గౌరవార్థం.. ఆమె పదవిని మరొకరితో భర్తీ చేయబోం అని పార్టీ ప్రకటిస్తే.. వారి భక్తిని తప్పుపట్టడం ఎలా కుదురుతుంది. ఈ రకంగా శశికళ వర్గానికి చెక్ పెట్టేశారని, వ్యూహాత్మకంగా వ్యవహరించారని అనిపిస్తోంది.