Home > Politics - Gossip
టీడీపీ నేతలకు సాయంచేసే పనిలో రఘువీరా రెడ్డి?

ఇప్పుడు కాదు.. మూడున్నరేళ్ల కిందటే క్లారిటీ వచ్చింది. రఘువీరారెడ్డి చాలా తెలివిగా గేమ్‌ ఆడుతున్నాడు అని. కాంగ్రెస్‌ను వీడక.. సొంత ఖర్చులు పెట్టుకొంటూ పీసీసీ బాస్‌గా ఆయన కొనసాగుతున్నాడు. ఇంతచేస్తూ రఘువీర సాధిస్తున్నది ఏమిటి? అని కొంతమంది ఆయన మీద తెగ సానుభూతి చూపించారు. అయితే రఘువీర మాత్రం చాలాతెలివిగా గేమ్‌ను నడిపిస్తున్నాడు. కాంగ్రెస్‌ పార్టీ పతనావస్థలో ఉండగా.. రఘువీర తన అనుచరులను తెలుగుదేశంలోకి పంపించేశారు. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే రఘువీర ఇటువైపు జంప్‌ అయిపోయేవారే. అయితే అది జరగలేదు.

అయితే ఎన్నికలు అయిపోయిన వెంటనే తెలుగుదేశంలో రఘువీర అనుచరుడికి ఎమ్మెల్సీ పదవి దక్కింది. తెలుగుదేశంలో చేరిన నెలల వ్యవధిలోనే ఆయనకు ఆ అవకాశం దక్కింది. అదంతా రఘువీర పలుకుబడే అని.. చంద్రబాబును మేనేజ్‌ చేసి తన అనుచరుడికి రఘువీరారెడ్డి ఎమ్మెల్సీ పదవిని ఇప్పించుకున్నాడనే వార్తలు అప్పట్లోనే గుప్పుమన్నాయి. ఇక అనంతపురం తెలుగుదేశం లీడర్లతో రఘువీరారెడ్డి చాలా చక్కటి సన్నిహిత సంబంధాలు మెయింటెయిన్‌ చేస్తున్నాడు మొదటి నుంచి. గతంలో కాంగ్రెస్‌ పవర్‌లో ఉన్న రోజుల నుంచినే తెలుగుదేశం లీడర్లతో లోలోపల సన్నిహిత సంబంధాలున్నాయని అంటారు.

అప్పట్లో వాళ్లకు రఘువీర సహకరించగా.. ఇప్పుడు వాళ్లు రఘువీరకు సహకరిస్తున్నారని టాక్‌. ప్రత్యేకించి పరిటాల సునీత వంటి వాళ్లతో రఘువీరకు సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయనే మాట వినిపిస్తూ ఉంటుంది జిల్లాలో. ఇప్పుడు కాంగ్రెస్‌ బాస్‌గా రఘువీర తెలుగుదేశం నేతలకు చాలానే ఉపయుక్తంగా మారుతున్నాడని సమాచారం. ఎంతలా అంటే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీని దెబ్బతీయడానికి, తద్వారా తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థులకు మేలు చేయడానికి రఘువీర ప్లాన్‌ సిద్ధం చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

వైసీపీ ఓట్లను, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి కొంతమంది అభ్యర్థులను కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దించే ప్రణాళిక ఒకటి రచిస్తున్నారని సమాచారం. ఆ అభ్యర్థులను తెలుగుదేశం వాళ్లే ఎంపిక చేసుకుంటారు. వాళ్లను రంగంలోకి దించడం రఘువీరారెడ్డి బాధ్యత అట. ఎవరైతే తమ నియోజకవర్గంలో తమ ప్రత్యర్థుల ఓట్లను చీల్చగలరో.. వాళ్లను కాంగ్రెస్‌ తరఫున రంగంలోకి దించడం టీడీపీ-కాంగ్రెస్‌ల వ్యూహం. ఉదాహరణకు రాప్తాడులో గంగుల భానుమతి గనుక రంగంలోకి దిగితే.. ఆమె వైసీపీ ఓట్లను చాలావరకూ చీల్చగలదు.

తద్వారా రాప్తాడు వైసీపీ అభ్యర్థికి వీలైనంత నష్టం చేయగలదు. అలాచేస్తే తెలుగుదేశం సిట్టింగ్‌ ఎమ్మెల్యే పరిటాల సునీతకు మేలు జరుగుతుంది. ఈ మేరకు రఘువీరను పావుగా వాడుకుని వైసీపీని దెబ్బతీయడానికి పరిటాల ఫ్యామిలీ భానుమతిని కాంగ్రెస్‌ తరఫున బరిలోకిదించే ప్రయత్నం ఒకటి జరిగింది. అయితే దానికి భానుమతి నిరాకరించడంతో వీళ్ల ప్లాన్‌ ముందుకు వెళ్లలేదని సమాచారం. భానుమతితో వ్యూహం బెడిసికొట్టినా.. మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ మాజీలతోనో, పేరున్న పాత నేతలను రంగంలోకి దించి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును, వైసీపీ అనుకూల ఓటును చీల్చడానికి టీడీపీ ప్లాన్‌ వేస్తోందని తెలుస్తోంది.

ఈ విధంగా కాంగ్రెస్‌ బాస్‌గా ఉంటూ తెలుగుదేశానికి యథారీతిన సేవలు అందిస్తున్నాడట రఘువీరారెడ్డి. మరి ప్లానైతే బాగానే ఉంది కానీ.. నంద్యాల్లో ఏం జరిగిందో గుర్తుంది కదా. అక్కడ ముస్లిం అభ్యర్థిని కాంగ్రెస్‌ తరఫున రంగంలోకి దించి ఏదో గేమ్‌ ఆడబోయారు కానీ.. అది బెడిసికొట్టింది. కాంగ్రెస్‌ బ్యాలెన్స్‌ పరువును తీసింది. వచ్చే ఎన్నికల్లోనూ ఇలాంటి వ్యూహాలే అమల్లో పెడితే.. కాంగ్రెస్‌ కథ చివరకు తోకలో ఈక అవుతుందేమో!