Advertisement


Home > Politics - Gossip
రాహుల్‌గాంధీ హిందువా.? కాదా.?

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ హిందువు కాదు.. ఆయన క్రిస్టియన్‌.. అయితే మాత్రం, రాజకీయాల్లో హిందువులు మాత్రమే వుండాలి, క్రిస్టియన్లో, ఇంకొకరో వుండాలనే రూల్‌ ఏమీ లేదు కదా.! కానీ, వైఎస్‌ జగన్‌ క్రిస్టియన్‌ కాబట్టి.. అంటూ పెద్ద రాజకీయ రచ్చ తెలుగునాట.. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటికప్పుడు జరుగుతూనే వుంది. తిరుపతికి వెళ్ళి, అక్కడ వెంకటేశ్వరస్వామి పట్ల విశ్వాసం వుందంటూ డిక్లరేషన్‌ ఇవ్వకపోవడంతో జగన్‌ పలు సందర్భాల్లో వివాదాల్ని ఎదుర్కొన్నారు. 

రాజకీయాల్లో కులాన్ని వాడేయొచ్చు, మతాన్ని వాడేయొచ్చు.. ప్రాంతీయ విధ్వేషాలతో ఓట్లు 'అడుక్కోవచ్చు'. నిబంధనలు ఎలా వున్నాసరే, వాటిని తుంగలో తొక్కేయడమెలాగో రాజకీయ నాయకులకు తెలుసు గనుక, దేశంలో ఏదీ తప్పు కానే కాదు.! ఒకవేళ తప్పు అయినాసరే, న్యాయస్థానాల్లో కేసులు ఎప్పటికి తేలాలిలే.. అన్న 'అతి' నమ్మకం రాజకీయ నాయకుల్లో పెరిగిపోబట్టే.. దేశం ఇలా తగలడింది.! 

ఇప్పుడిదంతా ఎందుకంటే, ఇప్పుడు రాహుల్‌గాంధీ విషయంలో 'మతం' పేరుతో భారతీయ జనతా పార్టీ రాజకీయం షురూ చేసింది. గుజరాత్‌ ఎన్నికల వేళ, రాహుల్‌గాంధీ హిందువు కాదన్న విషయాన్ని తెరపైకి తెచ్చింది బీజేపీ. పవిత్ర సోమనాథ్‌ దేవాలయంలో రాహుల్‌గాంధీ ప్రత్యేక పూజలు చేయడమే అసలు వివాదానికి కారణం. ఈ క్రమంలో ఆయన ఓ రిజిస్టర్‌లో తన పేరుని నమోదు చేశారు. అయితే, ఆ పేరు మీద, 'నేను హిందువుని కాను..' అని రాహుల్‌ పేర్కొన్నారన్నది బీజేపీ ఆరోపణ. అదంతా అబద్ధమన్నది కాంగ్రెస్‌ వాదన. 

'రాహుల్‌ హిందువు కాదని తేలిపోయింది..' అంటూ బీజేపీ, గుజరాత్‌ ఎన్నికల వేళ పెద్ద రచ్చ షురూ చేసింది. అయినా, రాహుల్‌ హిందువు అయితే ఎవరికి లాభం.? కాకపోతే ఎవరికి లాభం.? బీజేపీ, ఇక్కడ మినిమమ్‌ 'కామన్‌సెన్స్‌'ని కూడా కోల్పోయిందని అనుకోవాలేమో. రాహుల్‌ మతం విషయమై చాలాకాలంగా రచ్చ జరుగుతోంది. అదసలు అసందర్భం ప్రస్తుత రాజకీయాల్లో. కానీ, ఆ మతం పేరు చెప్పే కదా, రాజకీయాలు చేయాలి.! అదే జరుగుతోందిప్పుడు. 

ఒక్కటి మాత్రం నిజం.. గుజరాత్‌ ఎన్నికల పుణ్యమా అని భారతీయ జనతా పార్టీకి రాహుల్‌ గాంధీ అంటే ఎక్కడో సన్నగా 'భయం' బయల్దేరినట్టుంది. లేకపోతే, దేశంలో ఎక్కడా కాంగ్రెస్‌ పుంజుకోకపోయినా, గుజరాత్‌లోనే ఎందుకింత ఓవరాక్షన్‌ బీజేపీ వైపునుంచి జరుగుతోందట.? బీజేపీ అభద్రతా భావానికి ఇదొక నిదర్శనం అనుకోవాలేమో.! 

చివరగా: ఏ రాజకీయ నాయకుడూ తాను ఫలానా 'మతం కాదు' అని చెప్పడుగాక చెప్పడు. 'నేను హిందువుని, అలాగే నేను క్రిస్టియన్‌ని కూడా.. అన్ని మతాలూ నాకు ఒక్కటే..' అనే ఏ రాజకీయ నాయకుడైనా చెబుతాడు. ఆ మాత్రం ఇంగితం బీజేపీలో ఎందుకు కొరవడిందో మరి.!