Home > Politics - Gossip
రైతుకు సహాయం..కండిషన్స్ అప్లయ్

మిర్చి రైతుకు క్వింటాలుకు 1500 రూపాయల సహాయం అంటూ ఆర్భాటంగా ప్రకటించారు. దాన్నే బీభత్సంగా మీడియా ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు విధివిధానాలు బయటకు వచ్చాయి. దీనివల్ల ప్రభుత్వానికి అయ్యే ఖర్చు తక్కువ. లభించే ప్రచారం ఎక్కవ అని ఆ నిబంధనలే క్లియర్ చేస్తున్నాయి. ఈ స్కీము కేవలం గుంటూరు మిర్చి యార్డులో విక్రయాలు జరిపిన రైతుకు మాత్రమే వర్తిస్తుంది. అది కూడా అన్ని పద్దతులు పాటించి అమ్మిన రైతుకు మాత్రమే. 

అది కూడా ఇరవై క్వింటాళ్ల వరకు మాత్రమే. ఇరవై క్వింటాళ్ల వరకు అంటే పదిహేను వందల వంతున ఒక్కో రైతుకు ముఫై వేలు వస్తుందనుకుంటే కాదు. కనీస మద్దతు ధర అయిన 8000 వేలకు ఎంత తక్కువకు అమ్మితే, ఆ మొత్తాన్ని మాత్రమే భర్తీ చేస్తారు. అంటే ఉదాహరణకు ఏడు వేల వంతున అమ్మితే, వెయ్యి మాత్రమే ఇస్తారు. 7500 కు అమ్మితే 500 మాత్రమే ఇస్తారు. అలా అని నాలుగు వేలకు అమ్మితే నాలుగు వేలు ఇవ్వరు. 1500 మాత్రమే ఇస్తారు. ఇలా సహాయం అన్నది గ్రేడింగ్, దానికి వున్న కనీస మద్దతు ధర మీద ఆధారపడి వుంటుంది.

పైగా ఈ సాయం కోసం ఇంకా చాలా రూల్స్ పాటించాల్సి వుంటుంది. రైతులు పత్రాలు కాగితాలు, సంతకాలు సమర్పించాల్సి వుంటుంది. మొత్తం మీద ఈ స్కీము కోసం ఓ యాభై కోట్లు తీసుకునేందుకు సంబంధిత శాఖకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంటే ఈ పథకం అమలుకు అయ్యే ఖర్చు అంతే అన్నమాట.

కానీ పథకం ప్రకటించిన నాడు, ఆ తరువాత పత్రికలు చూస్తే ఎంత హడావుడి జరుగుతోందో కనిపిస్తుంది.