Advertisement


Home > Politics - Gossip
రజనీ వేదిక ఎక్కకపోవడం.. మోడీ ఎఫెక్టేనా?

మురసోలి పత్రిక 75వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన  సభకు ఇద్దరు తమిళ సూపర్ స్టార్ లు రజినీకాంత్, కమల్ హాసన్ హాజరు కావడం.. ఒకప్పట్లో మంచి మిత్రులైన వీరిద్దరూ.. చాలాకాలం తర్వాత ఓ వేదిక వద్ద కలుసుకోవడం అనేది ఇప్పుడు రాజకీయ చర్చల్లో వినిపిస్తోంది. అయితే.. ఈ సమావేశంలో.. రజినీకాంత్ మాత్రం వేదిక పైకి ఎక్కలేదు. ఆయన సభికుల మధ్యలోనే కూర్చుండిపోయారు.

కమల్ హాసన్ మాత్రం.. తతిమ్మా అతిథులతో పాటు వేదికను పంచుకున్నారు. అయితే చాలా మంది భవిష్యత్ రాజకీయ చిత్రం ఇదేనా అనే సందేహాలను ఇప్పటినుంచే వ్యక్తం చేస్తున్నారు. అంటే.. కమల్ హాసన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా? రజినీ దూరంగానే ఉండిపోతారా? అనే ఊహాగానాలూ సాగుతున్నాయి. 

అయితే డీఎంకే అనుబంధ మురసోలి పత్రిక వార్షికోత్సవ వేదిక మీదికి రజినీకాంత్ రాకపోవడం వెనుక భాజపా ప్రభావం కూడా ఉండవచ్చునని కొందరు విశ్లేషిస్తున్నారు. మోడీతో రజినీకాంత్ కు కొంత సాన్నిహిత్యం ఉంది. రజినీని గతంలో మోడీ పార్టీలోకి ఆహ్వానించిన నేపథ్యం కూడా ఉంది. అయితే అప్పట్లో ఆయన అందుకు ఓకే చెప్పలేదు. కాకపోతే.. ప్రస్తుతం రాజకీయాసక్తి చూపిస్తున్న తలైవా రజినీ సొంత పార్టీ పెడతారా? భాజపాలో చేరతారా? అనే సందేహాలు ఉన్నాయి. 

ఈ సమయంలో.. కేంద్రంలోని భాజపా.. తమిళనాడులోని అన్నా డీఎంకే ని తమ ఎన్డీయే కూటమిలో కలిపేసుకుంటున్నది. అన్నా డీఎంకే ను కలుపుకోవడం అంటే.. కాంగ్రెస్ జట్టుకు సన్నిహితంగా ఉండే డీఎంకే కు ప్రత్యర్థి కిందనే లెక్క! ఆ కోణంలోంచి చూసినప్పుడు.. రాజకీయంగా వైరిపక్షం వేదిక గనుక.. రజినీకాంత్ మురసోలి వార్షికోత్సవ వేదికమీదికి వెళ్లలేదనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. 

మోడీతో తనకున్న సాన్నిహిత్యం.. ఆ క్రమంలో భవిష్యత్తులో అన్నా డీఎంకేతో మైత్రి ఏర్పడగల అవకాశం ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని.. మురసోలి వేదికకు తలైవా రజినీ దూరంగా ఉండిపోయినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం అన్నా డీఎంకే లోని రెండు వర్గాలు- పళనిస్వామి- పన్నీర్ సెల్వం వర్గాలను ఒక్కటి చేసే బాద్యతను కూడా స్వయంగా మోడీ తీసుకున్నట్లు కనిపిస్తోంది.

శుక్రవారం వారిద్దరూ కలిసి  ఢిల్లీలో మోడీతో సమావేశమయ్యే అవకాశం ఉంది. పన్నీర్ ను ఉప ముఖ్యమంత్రిని చేస్తూ.. రెండు గ్రూపులను కలిపేసి.. స్థిర ప్రభుత్వాన్ని మోడీ ఏర్పాటు చేయవచ్చుననేది వినిపిస్తోంది. రజినీ సొంత పార్టీ పెట్టకుండా భాజపాలో చేరితో గనుక.. అన్నా డీఎంకే, భాజపా కలిసి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తే అప్పుడు సీఎం పదవి కాంబినేషన్లు మళ్లీ మారిపోయినా ఆశ్చర్యం లేదు. సుదూర భవిష్యత్తులో ఉండగల ఈ పరిణామాలు అన్నిటినీ దృష్టిలో ఉంచుకునే రజినీకాంత్ మురసోలి వేదిక మీదికి రాలేదని పలువురు అనుకుంటున్నారు.