Advertisement


Home > Politics - Gossip
రెండాకులూ ఒక్కటైపోతే.!

నాయకుడు లేకపోతే పడవ ప్రయాణం ఏమవుతుంది.? అన్నాడీఎంకే పార్టీ పరిస్థితి ఇప్పుడు అలాగే తయారయ్యింది. అధినేత్రి శశికళ జైల్లో వున్నారు. ఆమె స్థానంలో బాధ్యతలు నిర్వహిస్తున్న దినకరన్‌, సరికొత్త వివాదాల్లో ఇరుక్కున్నారు. పార్టీ పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోంది. ఈ పరిస్థితుల్లో 'శశికళ'ని వదిలించుకోవడం తప్ప పార్టీకి ఇంకో దారి కన్పించడంలేదు. శశికళను వదిలించుకోవడమంటే, ముందుగా పార్టీ నుంచి దినకరన్‌ని బయటకు సాగనంపడమే. ఆ దిశగా కసరత్తులు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి 'కఠిన నిర్ణయాలు' తీసుకోవడానికే సమాయత్తమయ్యారు. 

ఆర్‌కె నగర్‌ ఉపఎన్నిక ఈ మొత్తం 'వ్యవహారానికి' కారణంగా చెప్పుకోవచ్చు. ఎలాగైనా గెలిచేయాలి గనుక, కసితో ఖర్చు చేయడానికి ముందుకొచ్చారు దినకరన్‌. ఇందుకోసం ఓ మంత్రిగారిని పురమాయించారు. వందకోట్లు ఖర్చు చేయయడానికి రంగం సిద్ధంచేశారు. చాలావరకు ఖర్చు చేశారు కూడా. ఇది కాస్తా బయటపడ్డంతో మొత్తంగా ఉపఎన్నిక రద్దయ్యింది. ఇంకోపక్క, రెండాకుల గుర్తుకోసం దినకరన్‌ ఎన్నికల కమిషన్‌కి లంచమివ్వబోయిన వ్యవహారం వెలుగు చూసేసరికి, అన్నాడీఎంకే (శశికళ) వర్గం షాక్‌కి గురయ్యింది. 

ఈ పరిస్థితుల్లో పార్టీలో ఇంకా రెండువర్గాలు వుండడం సబబుకాదని భావిస్తోన్న పళనిస్వామి, స్వయంగా ఫోన్‌లో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంతో సంప్రదింపులు షురూ చేసినట్లు తెలుస్తోంది. పళనిస్వామికీ, పన్నీర్‌సెల్వంకీ మధ్యవర్తిగా అన్నాడీఎంకే సీనియర్‌ నేత 'తంబిదురై' వ్యవహరిస్తుండడం గమనార్హం. ఏ క్షణాన అయినా రెండువర్గాలూ కలిసిపోతాయనీ, పార్టీ అధినేతగా పన్నీర్‌ సెల్వం ఎంపికవుతారనీ, ముఖ్యమంత్రిగా పళనిస్వామి కొనసాగుతారనీ ప్రచారం జరుగుతోంది. 

అన్నట్టు, తాజాగా పన్నీర్‌ సెల్వం వర్గంలోని ఓ నేతపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మూడేళ్ళ జైలు శిక్ష పడిన దరిమిలా, పన్నీర్‌ సెల్వం కూడా 'రెండాకులు ఒక్కటవ్వాలి..' అనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా ఎలాగైనా జరగొచ్చు.. అనడానికి ఈ పరిణామాలే నిదర్శనం. అంతా బాగానే వుందిగానీ, జైలుకి వెళుతూ పన్నీర్‌ సెల్వంపై కసి తీర్చుకుంటానని 'జయలలిత సమాధిపై శపథం' చేసిన శశికళ పరిస్థితేంటట.?