Home > Politics - Gossip
కాంగ్రెస్ లోకి రేవంత్! : రెండు పార్టీల్లో కలకలం!

తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే పుకారు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా షికారు చేస్తోంది. ఎంతో కాలం కిందటినుంచి కర్ణాకర్ణిగా ఇలంటి పుకారు ఉన్నప్పటికీ.. ఇంత విస్తృతమైన చర్చ ఇదివరలో ఎన్నడూ జరగలేదు. పైగా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేరిక వ్యవహారం ఏకంగా ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం వరకు వెళ్లిందని, వారి పరిశీలనలో ఉన్నదనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తానికి ఈ పుకారు అటు తెలుగుదేశం, ఇటు కాంగ్రెస్ రెండు పార్టీల్లోనూ విపరీతమైన సంచలనాన్ని కలిగిస్తోంది.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అవసాన దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. నిజానికి ఈ పరిస్థితి ఏర్పడి కూడా ఇప్పటికి చాలా కాలమే గడిచింది. అప్పటినుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నదని, సరిగ్గా ఎన్నికల సంవత్సరంలోనే ఈ మార్పు జరగవచ్చునని, రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ వ్యతిరేక వర్గాల్లో ఒక  క్రేజ్ కలిగి ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థి గా ప్రొజెక్షన్ తో కాంగ్రెస్ లోకి వస్తారనే ప్రచారం సాగింది. ఆ తర్వాత కొంతకాలం ప్రచారం సద్దుమణిగింది కూడా.

తాజాగా ఇదే పుకారు మళ్లీ ప్రాణం పోసుకుంది. ఈసారి మరింత జోరుగా దీనిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. రేవంత్ ఎంట్రీ గురించి గాంధీభవన్ లో నాయకులు మాట్లాడుకుంటున్నారు. రేవంత్ ను చేర్చుకోవడం గురించి ఇప్పటికే ఢిల్లీ అధిష్టానం పరిశీలనకు కూడా వెళ్లిందని చెబుతున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ లోని కొందరు సీనియర్ నాయకులు మాత్రం రేవంత్ రాకను వ్యతిరేకిస్తున్నారు.

ప్రధానంగా రెడ్డి వర్గానికి చెందిన సీనియర్ నాయకులు, పార్టీ మీద పెత్తనం తమ చేతిలోకి వస్తుందనే ఆశ ఉన్నవాళ్లు ఆయనను వ్యతిరేకిస్తున్నట్లుగా కనిపిస్తోంది. రేవంత్ ను పార్టీలో చేర్చుకోవద్దంటూ.. ఇప్పటికే కొందరు నాయకులు అధిష్టానానికి లేఖలు కూడా రాసినట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలోనే ఈ విషయం పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చకు వచ్చినప్పుడు.. డికె అరుణ, కోమటిరెడ్డి వెంటకరెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి వంటి వాళ్లు వ్యతిరేకించారు. అయితే తెరాసను ఓడించి అధికారం దక్కించుకోవడానికి 2019 ఎన్నికల్లోనే సీరియస్ గా పోరాడాలని అనుకుంటున్న నాయకులు మాత్రం రేవంత్ రాకకు అనుకూలంగా ఉన్నారు. 

ప్రస్తుతం తెలంగాణలో అంతో ఇంతో కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా సీరియస్ గా పోరాడుతున్నది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. తెలుగుదేశంలో రేవంత్ మాత్రమే ఒంటరిపోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది. పైగా రాష్ట్ర వ్యాప్త ఇమేజి ఉన్న వారు కాంగ్రెస్ కు లేరు. ఈ నేపథ్యంలో రేవంత్ కాంగ్రెస్ లోకి వస్తే రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.