Advertisement


Home > Politics - Gossip
రేవంత్‌, విజయశాంతి - 'టి కాంగ్‌' స్టార్స్‌

రేవంత్‌రెడ్డి ఎక్కడ.? తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా 'పదవి' వదులుకుని, కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌రెడ్డి చేరడం వల్ల కొత్తగా ఆయనకు ఒరిగేదేంటి.? ఇలా సవాలక్ష ప్రశ్నలు ఆయన అభిమానుల్నే ఆందోళనకు గురిచేస్తున్నాయి. చాలామంది టి.కాంగ్రెస్‌ నేతలేమో, 'కాంగ్రెస్‌ మహా సముద్రం.. అందులో రేవంత్‌రెడ్డి ఓ నీటి చుక్క మాత్రమే..' అని లైట్‌ తీసుకుంటున్నారు. అందులో కొందరు టి.కాంగ్రెస్‌ నేతలు మాత్రం, తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి ముఖ్య నాయకుడిగా మారబోతున్నాడని గట్టి నమ్మకంతో వున్నారు. 

రేవంత్‌రెడ్డి సంగతి పక్కన పెడితే, గత కొంతకాలంగా కాంగ్రెస్‌ అధిష్టానం సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతితో ప్రత్యేకంగా మంతనాలు జరుపుతోన్న విషయం విదితమే. తెలంగాణ కాంగ్రెస్‌కి సంబంధించి విజయశాంతి త్వరలో కీలక పదవిలో కన్పించబోతున్నారట. స్వయంగా రాహుల్‌ గాంధీ, విజయశాంతికి ఆ పదవి కట్టబెట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది. 

రాహుల్‌, తెలంగాణపై ఫోకస్‌ పెట్టాక.. ముందుగా రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడం, ఆ తర్వాత విజయశాంతితో మంతనాలు జరుపుతుండడం.. ఈ తతంగం తెలంగాణ కాంగ్రెస్‌లో కొందరికి నచ్చడంలేదు. అయితే, వారందరినీ ఢిల్లీ పెద్దలు బుజ్జగించే ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటు విజయశాంతికీ, అటు రేవంత్‌రెడ్డికీ ఒకేసారి తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక బాధ్యతల్ని రాహుల్‌ అప్పగించనున్నట్లు తెలుస్తోంది. 

ఎఐసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులుంటాయనీ, ఆ భారీ మార్పులతోపాటే రేవంత్‌, విజయశాంతిలకు ముఖ్య పదవులు దక్కుతాయనీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. విజయశాంతి గతంలో టీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన విషయం విదితమే.