Home > Politics - Gossip
సేం2సేం: బాబుకు లోకేష్.. వెంకయ్యకు దీప!

రాజకీయ నాయకుల తీరుతెన్నుల మీద జోకులు వేసేవాళ్లు చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడులను చాలా సందర్భాల్లో ఒకే గాటన కట్టేస్తూ ఉంటారు. వీరిద్దరూ ఒకే తాను ముక్కలు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ సంగతి ఏమో గానీ.. మొత్తానికి వెంకయ్యనాయుడు స్వయంగా వెల్లడించిన ఓ రహస్యం ప్రకారం.. ఈ ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య ఓ అపురూపమైన సారూప్యత కనిపిస్తోంది. చంద్రబాబునాయుడుకు ఆయన కుమారుడు లోకేష్ ఎలాగో.. వెంకయ్యనాయుడుకు ఆయన కుమార్తె దీప కూడా అంతే అని అర్థమవుతోంది.

వెంకయ్యనాయుడు.. ఇక ఉపరాష్ట్రపతిగా బాధ్యతల్లోకి వెళ్లబోయేముందు.. మీడియా మిత్రులతో తన ముచ్చట్లు చెప్పుకుంటూ... ఇన్నాళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ రహస్యం కూడా బయటకు వచ్చింది. విద్యార్థి దశలోనే జనసంఘ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన వెంకయ్యనాయుడుకు భాజపాలో అత్యున్నత అవకాశం.. చిన్న వయసులోనే వచ్చిందిట.

కేవలం 42 ఏళ్ల వయసు ఉన్నప్పుడే వెంకయ్యనాయుడును భాజపా జాతీయ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించాల్సిందిగా కోరారుట. ఆ విషయం చర్చకు వచ్చినప్పుడు.. రెండేళ్ల పాటూ అత్యున్నతమైన అధ్యక్ష పదవిలో ఉంటే, ఆ తరువాత ఇంకేం చేస్తావ్ అంటూ తన కూతురు దీప వారించిందని, దాంతో తాను ఆ వయసులో అధ్యక్ష పదవిని తీసుకోలేదని వెంకయ్యనాయుడు వక్కాణించారు. 

ఇప్పుడు మీకో సంగతి గుర్తుకువస్తోందా? ఇలాంటిదే ఒక రహస్యాన్ని ఇటీవల చంద్రబాబునాయుడు కూడా వెల్లడించారు. గతంలో చంద్రబాబు చక్రంతిప్పిన కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తున్నప్పుడు.. తనకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని, అయితే తాత్కాలికమైన ప్రధాని పదవికోసం, శాశ్వతమైన ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడం ఎందుకని తన కొడుకు లోకేష్ చెప్పడంతో తాను ఆవైపు వెళ్లలేదని చంద్రబాబునాయుడు చెప్పుకొచ్చారు.

నిజానికి ఇంత సీనియర్ లు అయిన ఈ నాయకులకు వారు చెబుతున్న ఈ ప్రతిపాదనలు వచ్చిన సమయానికి వారి పిల్లల వయసెంతో, వారి రాజకీయ అనుభవం, అవగాహన ఎంతో మనకు తెలియదు గానీ.. ఈ ఇద్దరు మాత్రం అచ్చంగా ఒకే తీరుగా.. కొడుకు లోకేష్ చెప్పాడని చంద్రబాబు ప్రధాని పదవినీ, కూతురు దీప చెప్పింది గనుక వెంకయ్యనాయుడు పార్టీ అధ్యక్ష పదవినీ తోసిరాజనడం మాత్రం చిత్రంగానే ఉంది. ఈ ఇద్దరు నాయకులూ ఒక తాను ముక్కలే అనడానికి ఇది మరొక ఉదాహరణ అన్నమాట.