Home > Politics - Gossip
శవరాజకీయంలో బీజేపీ 'వాటా'

అసెంబ్లీ సాక్షిగా భూమా నాగిరెడ్డికి అవమానం జరిగింది. దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి సంతాప తీర్మానం సందర్బంగా నిన్న అసెంబ్లీలో చర్చ జరిగితే, ఆ చర్చలో భూమా నాగిరెడ్డి పేరు కన్నా, ఎక్కువగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరుని జపించడంతోనే సరిపెట్టారు అధికార పార్టీ నేతలు. చిత్రమైన విషయమేంటంటే, బీజేపీ తీరు సైతం అదేలా వుండడం. 

సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య వాగ్యుద్ధం జరిగినప్పుడో, సభలో సభ్యుల తీరు హద్దులు మీరుతున్నప్పుడో, 'మూడో పార్టీ' పెద్దన్న పాత్ర పోషిస్తుంటుంది. అసలక్కడ ప్రతిపక్షమే లేదు. దాంతో అధికారపక్షం చెలరేగిపోయింది. ఈ పరిస్థితుల్లో అధికారపక్షాన్ని వారించాల్సిన బీజేపీ కూడా అత్యుత్సాహమే ప్రదర్శించింది.. అధికార పార్టీకి వంతపాడింది. అసెంబ్లీలో అలా భూమా నాగిరెడ్డి సంతాపాన్ని, వైఎస్‌ జగన్‌ మీద విమర్శలతో బీజేపీ, టీడీపీ సరిపెట్టేశాయి. 

ఆ తర్వాత, మీడియా ముందుకొచ్చి ఇటు బీజేపీ, అటు టీడీపీ.. మళ్ళీ అదే పాత తంతు. పైగా, కొత్త నీతులు షురూ చేయడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. మరీ ముఖ్యంగా, 'నీతులు చెప్పే' ఎపిసోడ్‌లో బీజేపీ నేతలు, మీడియా లైవ్‌ షోలలో జీవించేస్తుండడం గమనార్హం. 'అధికార పార్టీ, జగన్‌ ప్రస్తావన తీసుకురాకుండా వుండి వుంటే బాగుండేదేమో..' అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు కొందరు బీజేపీ నేతలు. 'మీ పార్టీ నేతలూ అదే చేశారు కదా.? అని ప్రశ్నిస్తే.. అది కూడా జరిగి వుండాల్సింది కాదు..' అంటూ తప్పుని ఒప్పేసుకోవాల్సిన దుస్థితిలోకి బీజేపీ వెళ్ళిపోయింది. 

మొత్తమ్మీద, శవరాజకీయంలో టీడీపీ చెలరేగిపోతోంటే, ఆ మత్తులో బీజేపీ కూడా జోగుతుందన్నమాట. గతంలో రోజా సస్పెన్షన్‌ ఎపిసోడ్‌లో బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు, పూటకో మాట మాట్లాడారు. రోజా సస్పెన్షన్‌ని ఎత్తివేయాలని కోరిందీ ఆయనే, సస్పెన్షన్‌ సబబు.. అని వాదించిందీ ఆయనే. కేంద్ర స్థాయిలో బీజేపీ, చంద్రబాబుని ఆడిస్తోంటే.. ఆంధ్రప్రదేశ్‌ స్థాయిలో చంద్రబాబు, బీజేపీ నేతల్ని ఆడిస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?