Advertisement


Home > Politics - Gossip
హోదా పేరెత్తితే ఐటమ్ నెంబర్స్ అంట!

చంద్రబాబునాయుడు మాత్రమే కాదు.. ఆయన ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తున్న మేధావులు, రంగాలవారీ నిపుణులుగా పేరున్న వారు కూడా ఆయన తరహాలోనే మాయమాటల్తో ప్రజల్ని బురిడీ కొట్టించే ప్రచారానికి తెర తీస్తున్నట్లుగా  కనిపిస్తోంది. ఆర్థిక రంగ నిపుణులుగా ఎంతో పేరున్న కుటుంబరావు ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు.

రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు కూడా ప్రత్యేక హోదా గురించిన చర్చ... జగన్ యువభేరి తర్వాత ప్రజల్లో మళ్లీ మొదలైన నేపథ్యంలో ఒక టీవీ ఛానెల్ లో జరిగిన చర్చలో కుటుంబరావు కూడా పాల్గొన్నారు. చర్చలో భాగంగా.. ప్రత్యేకహోదా గురించి రాష్ట్రంలో మాట్లాడుతున్న వాళ్లు, ఉద్యమాలు అంటున్న వాళ్లు.. సినిమాలో అప్పుడప్పుడూ వచ్చి వెళ్లే ఐటం నెంబర్స్ లాంటి వారంటూ కుటుంబరావు కామెంట్ చేయడం ఇప్పుడు వివాదస్పదం అవుతోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్న వారిని ఇలా ఐటంగాళ్స్ తో పోలుస్తారా అంటూ ప్రజలు ఆగ్రహోదగ్రులు అవుతున్నారు. 

కుటుంబరావు ప్రభుత్వంలో వ్యక్తిగా ఉన్నప్పుడు, ఆయన ఎంత మేధావి, ఎంత ఆర్థికరంగ నిపుణులు అయినప్పటికీ నిజాయితీగా ఉన్నదున్నట్టు చెబుతారని ఆశించడం కరెక్టు కాదు. ప్రభుత్వానికి అనుకూలంగా మాత్రమే ఆయన మాట్లాడారు. ప్రత్యేకహోదా వల్ల రాష్ట్రానికి ఈ మూడేళ్లలో రావాల్సిన అనేక వేలకోట్ల నిధుల నష్టం జరిగిందని జగన్  తన యువభేరి కార్యక్రమంలో ప్రధానంగా గణాంకాల సహా చెప్పినప్పుడు.. ఆ గణాంకాల జోలికి వెళ్లకుండా జీఎస్టీ ప్రయోజనాల్లో కూడా రాష్ట్రానికి నష్టం జరుగుతోంది అనే అంశాన్ని మాత్రమే కుటుంబరావు తీసుకున్నారు.

జీఎస్టీ చట్టంలో హోదా ఉన్న రాష్ట్రాలకు నష్టం జరిగేలా కొన్ని నిబంధనలు ఉన్నాయంటూ అసలు చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. అయితే హోదా వల్ల దక్కాల్సిన ప్రయోజనాలను నష్టపోయామా లేదా? లేదా, ప్యాకేజీ రూపంలో చెప్పిన మొత్తం ప్రయోజనాలు ఇంకా రాలేదని సీఎం చెప్పిన విషయం వాస్తవమా కాదా? అనే చర్చను ఆ అంశాలకు సంబంధించి మాత్రమే వివరణ చెప్పాలని పదేపదే కోరినా.. ఆయన అసలు అంశాలను దాటవేసేందుకు ప్రయత్నించారు. 

ఇదంతా ఒకఎత్తు అయితే చర్చలో పాల్గొన్న ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కూడా తాము హోదాకోసం అలుపెరగని పోరాటం తొలినుంచి చేస్తూనే ఉన్నాం అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ వారు కూడా అదే వాదన వినిపించారు. అయితే అందరూ తాము హోదాకోసం పనిచేస్తున్నాం.. ప్రజల్లో- హోదా ఆకాంక్షలు ఉన్నాయి అంటూ వారు వాదించారు.

ఈ సందర్భంగా కుటుంబరావు స్పందిస్తూ.. అప్పుడప్పుడూ ప్రజల ముందుకు వచ్చి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్న వాళ్లు, సినిమాల్లో ఐటం నెంబర్ల వంటి వారంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. కేంద్రంనుంచి హోదా సాదించడం అనేది చంద్రబాబు ప్రభుత్వానికి చేతకాకపోయినాపాయె.. దానికోసం పోరాడుతున్నా, కనీసం మాటలైనా చెబుతున్న వారిని ఐటంగాళ్స్ తో పోలుస్తూ వ్యాఖ్యలు చేయడం గర్హనీయం అని, కుటుంబరావు లాంటి వాళ్లకు ఇది తగదని పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.