Home > Politics - Gossip
బ్యాంకర్లపై కస్సుబుస్సు.. అందిరిందయ్యా సుజనా!

‘‘బ్యాంకర్లు ప్రజల డబ్బు డిపాజిట్లుగా తీసుకుని దానితో వ్యాపారం చేస్తున్నాయే తప్ప.. ప్రజలకు రుణాలు ఇవ్వడం లేదు.. ఈ పద్ధతి  సరి కాదు.. విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలి...’’ ఈ వాక్యాలు బాగానే ఉన్నాయి. సాధారణంగా ఏ నాయకులు అయినా ఇలాగే మాట్లాడతారు. రాజకీయ నాయకులు ఎప్పుడూ ప్రజలపక్షానే మాట్లాడుతుంటారు గనుక.. బ్యాంకర్ల సమావేశంలో ఇంతకంటె భిన్నమైనవి మనం ఆశించలేం.

కాకపోతే బ్యాంకర్ల నుంచి వందల కోట్ల రూపాయల రుణాలు తీసుకునే దార్లలో విపరీతమైన అనుభవం గడించినట్లుగా ముద్రపడిన, వందల కోట్ల రూపాయలు విదేశీ బ్యాంకులకు ఎగవేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న.. కేసులు కోర్టు విచారణలకు కూడా హాజరవుతూ.. కేంద్రమంత్రి అయిన తర్వాత సాంకేతిక కారణాల నేపథ్యంలో కేసులనుంచి తప్పించుకున్న సుజనా చౌదరి కూడా ఇదే మాటలు వల్లిస్తోంటే సాటి నాయకులే నవ్వుకుంటున్నారు. 

సుజనా చౌదరి ముద్ర రుణాల పంపిణీకి సంబంధించి విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల డబ్బుతో వ్యాపారం చేస్తూ ప్రజలకు రుణాలు ఇవ్వడానికి మాత్రం బ్యాంకులు వెనుకాడుతున్నాయంటూ సుజనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంగతి వినగానే.. సుజనా ఎగవేసిన వందల కోట్ల రూపాయల అప్పుల ఆరోపణలు గుర్తుకు వచ్చి జనం మాత్రం నవ్వుకోవడం విశేషం. 

బ్యాంకర్ల మీద తన మీద కేసులు నడిచిన కాలం నుంచి బాగా కాక మీద ఉన్నారేమో.. సుజనా ఒక రేంజిలో వారిని ఆడుకున్నారు. కార్యక్రమానికి వచ్చిన లబ్ధిదారులైన మహిళలతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడి.. రుణాలు ఎందుకు తీసుకుంటున్నారు.. ఏం వ్యాపారం చేస్తున్నారు లాంటి ప్రశ్నలు కూడా అడిగారు.

చివరికి... బ్యాంకులలు తాము ఎంపిక చేసిన వ్యక్తిగత ఇతర రుణాలను కూడా వాణిజ్య రుణాల కింద చూపిస్తూ ముద్ర రుణాల కింద మాయచేసి.. తనతో ఇప్పిస్తున్న వైనం ఆయన గుర్తించారు. ఈ విషయంలో బ్యాంకుల దోరణిని కూడా మంత్రి తప్పు బట్టారు. బ్యాంకుల డ్రామాలు, మాయలను ఇవాళ సుజనా ప్రశ్నించారు గానీ.. దీనిని గమనిస్తే.. అసలు ముద్ర రుణాల ముసుగులో ఎన్నిన్ని మాయలు జరుగుతున్నాయో అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగంలో మరో ట్విస్టు కూడా ఉంది. ‘‘బ్యాంకర్లు ఇలాంటి రుణాల ఎంపికలో రాజకీయ నాయకులను సక్రమంగా ఉపయోగించుకోవాలని.. వారిని వాడుకుంటే గనుక.. రుణాలు తీసుకున్న వారు తిరిగి సక్రమంగా చెల్లించేలా చూడడానికి కూడా నాయకులు ఉపయోగపడతారని..’’ సుజనా చౌదరి సెలవిచ్చారు. స్వయంగా తానే వందల కోట్ల రూపాయల రుణాల్ని ఎగవేసినట్లుగా ఆరోపణలు కేసులు ఎదుర్కొన్న వ్యక్తి.. ప్రజలు తీసుకునే రుణాలను తిరిగి ఇప్పించడానికి నాయకులు సహకరిస్తారంటూ సుద్దులు చెప్పడం కామెడీ కాక మరేమిటి అనం జనం విస్తుపోతున్నారు.