Home > Politics - Gossip
'టీ' అసెంబ్లీ: టీఆర్‌ఎస్‌కి అదే బిగ్‌ బోనస్‌

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మామూలే. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో అసలు విపక్షమే ఇప్పుడు లేదాయె. దాంతో, అధికార పార్టీ ఓ రేంజ్‌లో సొంత భజనకు వేదికగా అసెంబ్లీ సమావేశాల్ని మార్చేసింది. అధికార పార్టీ మెప్పుకోసం బీజేపీ, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో వ్యవహరిస్తున్న తీరు ఇంకా ఆశ్చర్యకరం. 'మరీ బాగోదు' అనుకున్నారో ఏమో, అధికార పార్టీలోనే కొందరు నేతలు విపక్షంలా వ్యవహరిస్తూ, రాష్ట్ర ప్రజల్ని మరింత ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ స్థాయిలో హైడ్రామా అయితే తెలంగాణ అసెంబ్లీలోనే కాదు, ఇంకెక్కడా కన్పించదు. 

ఇక, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒకింత హర్షం వ్యక్తంచేస్తోంది. అయితే, అది కూడా ఏపీకి చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నుంచి ఆ హర్షం వ్యక్తమవడం విశేషమే మరి. తెలంగాణలో వైఎస్సార్సీపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ 2014 ఎన్నికల ద్వారా లభించారు. ఏం లాభం.? వారంతా, ఎప్పుడో గులాబీ కండువా కప్పేసుకున్నారనుకోండి.. అది వేరే విషయం.

అయినాగానీ, తెలంగాణలోని అధికార టీఆర్‌ఎస్‌ అంటే వైఎస్సార్సీపీకి అదో ప్రత్యేకమైన అభిమానం. అందుకే, అసెంబ్లీ సమావేశాల్ని టీఆర్‌ఎస్‌ నిర్వహిస్తోన్న తీరుపట్ల హర్షం వ్యక్తం చేసేస్తున్నారు ఏపీ వైఎస్సార్సీపీ నేతలు. ఏపీలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారనీ, హార్డ్‌ క్యాష్‌తో కాకుండా, కాంట్రాక్టులతో వారిని ప్రలోభపెట్టారనీ వైఎస్సార్సీపీ ఏపీ ఎమ్మెల్యే సెలవిచ్చారు. మరి, తెలంగాణలో కేసీఆర్‌, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలనీ, ఎంపీనీ ఎలా కొనుగోలు చేశారట.? అదీ వివరిస్తే బావుండేదేమో.! 

ఏమాటకామాటే చెప్పుకోవాలి.. తెలంగాణ అసెంబ్లీలో నిఖార్సయిన విపక్షంలేదు. ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీనే అయినా, ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఒక్కోసారి టీఆర్‌ఎస్‌కి అనుకూలంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్‌కే షాక్‌ ఇస్తుంటారు. అది టీఆర్‌ఎస్‌కి నిజంగానే పెద్ద బోనస్‌. టీడీపీకి ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో వున్నది ఒకే ఒక్క ఎమ్మెల్యే. మజ్లిస్‌ ఎలాగూ టీఆర్‌ఎస్‌కి బయటనుంచి మద్దతిస్తోన్న మిత్రపక్షం. బీజేపీ ఓ ప్రత్యేకమైన వైఖరి. వెరసి.. టీఆర్‌ఎస్‌కి, అసెంబ్లీలో వున్న ఎడ్జ్‌ అలాంటిలాంటిది కాదు.! 

ఏదిఏమైనా, వైఎస్సార్సీపీ సపోర్ట్‌ చేసిందని కాదుగానీ.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సజావుగానే సాగుతున్నాయి. ఒక్కోసారి పరిస్థితులకు అనుగుణంగా అధికార పార్టీ మెట్టుదిగి ఎక్కువ రోజులు అసెంబ్లీకి సమయం కేటాయించడంగానీ, జానారెడ్డిని గౌరవిస్తున్నట్లే కన్పిస్తూ, విపక్షాల కోరికను మన్నించినట్లు పలు అంశాల విషయంలో వ్యవహరించడంగానీ.. ఆ తరహా వ్యూహాలతో కేసీఆర్‌, విపక్షాలు తమను విమర్శించేందుకూ జంకే పరిస్థితిని తీసుకొస్తున్నారన్నది నిర్వివాదాంశం.