Advertisement


Home > Politics - Gossip
పళనీ, పన్నీరు.. ఎన్ని రోజులో..

మొత్తానికి శశికళను, దినకరన్ ను పార్టీ నుంచి బయటకు పంపేశారు. శశికళ ఆల్రెడీ జైల్లో ఉంది, దినకరన్ కూడా ఆ బాటలోనే ఉన్నాడు. ఇంతకు మించిన తగు సమయం లేదన్నట్టుగా పళనిసామి వారిద్దరినీ బయటకు పంపేశాడు. సరిగ్గా కొన్ని రోజుల ముందు శశికళను చిన్నమ్మగా సంబోధిస్తూ ఆమెకు సాష్టాంగ పడిన వాళ్లే పళని సామి వర్గీయులంతా. పళనిని ముఖ్యమంత్రిగా చేసేందుకు శశికళ వందల కోట్లు ఖర్చు పెట్టిందంటారు. బంటులా పడి ఉంటాడని ఆమె అనుకుంది, ఆల్రెడీ మునిగిన ఆమెను కోలుకోనంత లోపలకు తొక్కేశాడు పళని! రాజకీయం అంటే అంతే మరి. మరి జైల్లో ఉంది కాబట్టి శశిని, కేసులో ఇరుక్కున్నాడు కాబట్టి దినకరన్ ను పంపించేయగలిగారు కానీ, పళనిసామి, పన్నీరు కలిసి ఏ మేరకు బండి లాగించగలరు? అనేదే ఇప్పుడు సందేహం.

అసలే.. వీళ్లకు ఉన్నది అంతంతమాత్రం మెజారిటీ! శశిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినందుకు గానూ.. ఎవరో ఐదారు మంది ఎమ్మెల్యేలు అయినా హల్ చల్ చేసే అవకాశం ఉంది. అలా చేస్తే కొంత డబ్బును డిమాండ్ చేయడానికి అయినా అవకాశం ఉంటుందని చేసే వాళ్లుంటారు. అలాగే శశితో ఆర్థిక లావాదేవీలు కలిగిన వారైనా ఇప్పుడు అలజడి పుట్టించే అవకాశాలుంటాయి. పన్నీరు వచ్చి చేరితే నంబర్ గేమ్ లో పళని పరిస్థితి కొంచెం మెరుగవుతుంది. కానీ గ్రూపులు ఏర్పడటం ఖాయం. తనను ముఖ్యమంత్రిగా చేసిన శశిని ముంచేయడానికే వెనుకాడని పళనిసామి .. పన్నీరును నెత్తిన పెట్టుకుంటాడా? నెత్తిన పెట్టుకోకుంటే.. పన్నీరు పళనిని ప్రశాంతంగా ఉండనిస్తాడా? గ్రూపు రాజకీయాలు ఇక పీక్స్ కు చేరే అవకాశం ఉంది. పళని సామి వర్గం, పన్నీరు వర్గం, వీళ్లిద్దరినీ వ్యతిరేకించే వర్గం.. జయలలిత మరణించింది డిసెంబర్ ఐదో తేదీ, పళనిసామి సీఎం అయినది ఫిబ్రవరి 16 వ తేదీ.

ఆ రెండు నెలలా పది రోజుల్లోనే ఎన్నో పరిణామాలు.. పళని సీఎం అయిన తర్వాత రెండు నెలల్లోనే ఇన్ని రాజకీయ సంచలనాలు.. ఇలా సాగుతున్నాయి తమిళనాడు రాజకీయ పరిణామాలు. మరి మరో రెండు నెలల తర్వాత ఏమైనా జరగొచ్చు! పళనీ, పన్నీరు కలహించుకోవచ్చు.. పన్నీరు ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నం చేయవచ్చు.. ఎమ్మెల్యేల్లో ఏవైనా తిరుగుబాట్లు రావొచ్చు.. ఏమైనా జరగొచ్చు. ఇప్పటి వరకూ పరిణామాలు సాగిన వేగం చూస్తే.. అన్నాడీఎంకే ప్రభుత్వం ఎక్కువ కాలం అయితే ఉండదు. బహుశా ఇది ఏర్పడిన ముహూర్తమే సరిగా లేనట్టుంది!