Advertisement


Home > Politics - Gossip
తప్పదు శ్రీకాంత్‌.. తట్టుకుని నిలబడాల్సిందే.!

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డికి పెద్ద కష్టమే వచ్చిపడింది. ఆయన పార్టీ మారబోతున్నారంటూ చాలాకాలంగా గాసిప్స్‌ విన్పిస్తున్నాయి. కానీ, వైఎస్సార్సీపీ ముఖ్య నేతల్లో ఒకరైన శ్రీకాంత్‌రెడ్డి, తన మీద వస్తోన్న గాసిప్స్‌ని ఎప్పటికప్పుడు ఖండించేయడమే కాదు, ఆ గాసిప్స్‌ పట్ల తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేయాల్సి వస్తోంది. తప్పదు మరి, రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే.! 

పైగా, అక్కడ టీడీపీ అనుకూల మీడియా ఎలాగైనా వైఎస్సార్సీపీని 'బలహీనం' చేయాలని 'కంకణం' కట్టేసుకుంది. ఈ విషయంలో టీడీపీ కంటే ఎక్కువ బాధ్యత, టీడీపీ అనుకూల మీడియా తీసుకుందన్నది నిర్వివాదాంశం. వైఎస్సార్సీపీ ముఖ్య నేతల మీద గాసిప్స్‌ని తెరపైకి తీసుకురావడంతోనే అసలు కథ మొదలవుతుంది. ఒక్కసారి గాసిప్స్‌ వచ్చాక, వాటిని ఖండించి తీరాల్సిందే. ఖండించినాసరే, వైఎస్సార్సీపీలో ఆయా నేతలపై 'అనుమానాలు' షురూ అవుతాయి. అవమానాలూ తప్పవు. తట్టుకుని నిలబడితే సరేసరి.. లేదంటే మాత్రం అంతే సంగతులు.! 

శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌కి అత్యంత సన్నిహితుడు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. కానీ, గతంలో ఆయన ఓ సారి టీడీపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారన్న గాసిప్స్‌తో, వైఎస్సార్సీపీలో ఆయన ఇమేజ్‌ పడిపోయింది. మళ్లీ ఎలాగోలా, జగన్‌ దగ్గర 'నమ్మకం' సంపాదించుకున్నారాయన. మళ్ళీ ఇప్పుడు.. ఇదిగో, ఇలా గాసిప్స్‌ షురూ అయ్యాయి. 'దారుణం, దుర్మార్గం..' అంట శ్రీకాంత్‌రెడ్డి గగ్గోలు పెడ్తున్నారు. 

జగన్‌ కోసం మంత్రి పదవి కాదనుకున్న కొండా సురేఖ కంటే, శ్రీకాంత్‌రెడ్డి జగన్‌కి నమ్మకస్తుడని అనుకోగలమా.? ఒకప్పుడు జూపూడి ప్రభాకర్‌, ఏ స్థాయిలో జగన్‌ని వెనకేసుకొచ్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడిదాకానో ఎందుకు, మొన్నీమధ్యనే గిడ్డి ఈశ్వరి, వైఎస్సార్సీపీకి గుడ్‌ బై చెప్పారు.. ఇది జగన్‌ సైతం ఊహించని విషయమే. రాజకీయాల్లో ఎత్తులు, పైయెత్తులు మామూలే. అందునా, టీడీపీ ఇప్పుడు కొత్త తరహా చెత్త రాజకీయాన్ని తెరపైకి తెచ్చింది. దానికి టీడీపీ అనుకూల మీడియా పూర్తిస్థాయిలో మద్దతిస్తోంది. ఈ నేపథ్యంలో ఫిరాయింపు రాజకీయాలకు ఎవరూ అతీతం కాదు. 

ఇంతకీ, శ్రీకాంత్‌రెడ్డి జగన్‌ వెంటే నిలబడ్తారా.? నిలబడి చూపించగలగాలి.. జగన్‌ దగ్గర తన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. చూద్దాం, ఏం జరుగుతుందో.!