Advertisement


Home > Politics - Gossip
టీడీపీ ఆశించింది ఒకరిని.. బుట్టలో పడింది మరొకరు!

వాస్తవానికి బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీ హిట్‌ లిస్టులో లేదు. కర్నూలు ఎంపీగా ఉన్న ఆమెను పార్టీలోకి చేర్చుకోవడానికి తెలుగుదేశంపార్టీకి మొదట నుంచి ఏమీ ఆసక్తిలేదు. కర్నూలు ఎంపీ సీటు విషయంలో తెలుగుదేశం పార్టీ అసలు టార్గెట్‌ వేరే.

ఆ టార్గెట్‌.. కోట్ల జయ సూర్యప్రకాష్‌ రెడ్డి!  తెలుగుదేశం పార్టీ ముందుగా ఆయనను లక్ష్యంగా చేసుకుంది. అందుకోసం మూడు సంవత్సరాల కిందటే చర్చలు మొదలుపెట్టింది. వాటికి తెర తీసింది.. లోకేష్‌ బాబే! 

పార్టీలోకి వచ్చి చేరాల్సిందిగా కోట్ల జయ సూర్య ప్రకాష్‌ రెడ్డిని ఆహ్వానించాడు లోకేష్‌. అందుకోసం విశ్రమించకుండా టీడీపీ ప్రయత్నించింది. మూడు సంవత్సరాల పాటు అందుకు సంబంధించిన తతంగం నడిచింది. రాయలసీమలో పార్టీ బలపడాలి అంటే.. ఫిరాయింపులు, చేరికలే పరిష్కార మార్గం అని.. తెలుగుదేశం పార్టీ భావించింది.

అందులో భాగంగా కర్నూలు ఎంపీ సీటుకు కోట్లను పరిష్కారంగా చేసుకుంది. జేసీ దివాకరెడ్డి, ఇతర రాయలసీమ రెడ్డి నేతలు, మాజీ కాంగ్రెస్‌ వాళ్లు బుట్టలో పడినట్టుగా కోట్ల కూడా పడతాడని టీడీపీ లెక్కేసింది. అయితే కథ.. అలా నడవలేదు.

కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డిని టీడీపీ చేర్చుకోలేకపోయింది. కర్నూలు వంటి సీట్లో తెలుగుదేశం గెలవాలంటే.. కోట్ల వంటి వ్యక్తే రైటు అని ఆ పార్టీనే అనుకున్నప్పటికీ.. అది జరగలేదు. పలుదఫాలుగా ఆ ప్రయత్నాలు చేసినా ఆ ప్రయోజనం దక్కలేదు. కోట్ల కోసం ట్రై చేసి.. చివరకు బుట్టా రేణుకతో సర్దుకుపోయింది. ఇప్పుడు కోట్లకు వైకాపా గాలం వేసే పనిలో ఉంది. దాని ప్రయోజనాలు ఎలా ఉంటాయో చూడాలి.