Home > Politics - Gossip
కాపుల వైపు... టీడీపీ మొగ్గు...!

బీసీ రిజర్వేషన్లకై నిర్ణయం!

ముద్రగడకు చెక్‌ పెట్టేందుకు వ్యూహం

నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మంచి జోష్‌ మీదున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇక కాపు సామాజికవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టి సాధించింది. కాపులు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నట్టు జరిగిన ప్రచారం తాజా ఎన్నికల ఫలితంగా తేలిపోయింది. ఫలితాలు అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండటంతో ఇక తమ వైపే కాపులందరూ ఉన్నట్టు ఇప్పటికే ఆ సామాజికవర్గానికి చెందిన ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బాహాటంగా చెప్పారు.

ఇదే సమయంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చుట్టూ కాపులెవరూ లేరని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాపులకు అనుకూల నిర్ణయం తీసుకోవడం ద్వారా ముద్రగడను ఏకాకిని చేసే యోచనలో అధికార పార్టీ ఉన్నట్టు స్పష్టమవుతోంది. అలాగే వైకాపాకు కాపులందరూ వ్యతిరేకంగా ఉన్నారని, తెలుగుదేశం వైపే కాపులున్నట్టు సంకేతాలిచ్చేందుకు టీడీపీ నేతలు వ్యూహత్మకంగా సాగుతున్నారు.

ఈ నేపథ్యంలో త్వరలో కాపులను బీసీల్లో చేర్చేందుకు నిర్ణయిస్తూ చేసిన తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు యోచిస్తున్నట్టు తెలిసింది. రాజకీయంగా రిజర్వేషన్లకు కాపుల నుండి అంతగా డిమాండ్‌ లేదు. ఆ సామాజికవర్గం రాజకీయంగా సముచిత స్థానంలోనే ఉన్నారు. దీంతో విద్య, ఉద్యోగ, పదోన్నతుల్లో రిజర్వేషన్లకు ముఖ్యమంత్రి ఇప్పటికే సానుకూలంగా స్పందించారు. అయితే కాపులకు ప్రభుత్వం చేసిన మేలుకు సంబంధించిన క్రెడిట్‌ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభానికి దక్కకుండా, ఆ ఘనత అంతా కాపు మంత్రులకే లభించే వ్యూహంతో సాగుతున్నారు.

కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకే రిజర్వేషన్లు, ఇతర ప్రయోజనాలు సాధించుకున్నట్టు బయటి ప్రపంచానికి సంకేతాలు వెళ్ళేలా చూడాలని ముఖ్యమంత్రి సదరు నేతలకు సూచించినట్టు సమాచారం! ముద్రగడ పద్మనాభం కాపులకు రిజర్వేషన్ల కోసం వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కాపులకు అనుకూలంగా ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నా అది ముద్రగడకే దక్కే అవకాశం ఉందని, అయితే ఇటీవల కాకినాడ, నంద్యాల పన్నికల్లో కాపులు తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరించినందున కాపులకు అనుకూలంగా ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రభుత్వానికే అనుకూలిస్తుందని భావిస్తున్నారు. 

అలాగే రాష్ట్రంలోని కాపులు ముద్రగడ వెంటే ఉన్నారంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు ఇంతకాలం వ్యాఖ్యానిస్తూ వచ్చారు. తాజా ఎన్నికల ఫలితాలతో ఆ భ్రమలు కూడా వారికి తొలగిపోయాయని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాపు మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అదే పనిగా ముద్రగడపై విమర్శలు గుప్పిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అవకాశం దొరికిన ప్రతిసారీ ముద్రగడపై ధ్వజమెత్తుతున్నారు.

ముద్రగడ వెంట కాపులెవరూ లేరన్న విషయం తాజా ఎన్నికలతో రుజువైందని, ఆయన వెంట కేవలం వైసీపీ కాపులే ఉన్నారని, కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించడం ముద్రగడకు ఇష్టం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. మంజునాథ కమీషన్‌ నివేదిక వచ్చిన అనంతరం రిజర్వేషన్లు కల్పించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. ముద్రగడ కాపుల రిజర్వేషన్లకు అడ్డుతగులుతున్నారని విమర్శించారు.

దీనిపై ముద్రగడ కూడా ఘాటుగానే స్పందించారు. కాపులకు కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి, రుణాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందంటే అందుకు కారణం తమ పోరాట ఫలితమేనని, ఒకవేళ కాపుల మద్దతు మీకే ఉన్నట్టు భావిస్తే ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలకు సిద్ధం కాగలరా? అని ప్రశ్నించారు. అలాచేస్తే రాష్ట్రంలో కాపులు ఎవరివైపు ఉన్నారో స్పష్టమవుతుందని పేర్కొన్నారు.