Home > Politics - Gossip
టీడీపీకి బీజేపీ వెన్నుపోటు తప్పదా.?

'ఇప్పటికైతే మేం తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షంగానే వున్నాం. 2019 ఎన్నిలకు సంబంధించి పొత్తుల విషయమై ఇప్పుడే ఏమీ మాట్లాడలేం. కానీ, మా పార్టీకి 15 నుంచి 20 శాతం వరకూ ఓటు బ్యాంకు స్పష్టంగా కన్పిస్తోంది. ఇంకో ఐదు శాతం పెరగనుంది కూడా.. 15 నుంచి 25 అసెంబ్లీ సీట్లు, నాలుగైదు ఎంపీ సీట్లు సొంతంగా గెలుచుకునే పరిస్థితుల్లో వున్నాం..' 

- ఇదీ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి భారతీయ జనతా పార్టీ లెక్క.

తెలంగాణలో అయితే, టీడీపీతో కొనసాగే పరిస్థితి బీజేపీకి కన్పించడంలేదు. టీడీపీ - బీజేపీ మధ్య మాటల యుద్ధం సర్వసాధారణమైపోయిందక్కడ. 'తెలంగాణలో టీడీపీతో కలిసి ముందడుగు వేస్తే, మా ఓటు బ్యాంకుకే చిల్లుపడేలా వుంది..' అని బీజేపీ నేతలు చెప్పడం, 'బీజేపీతో కలవడం వల్లే మాకు మైనార్టీ ఓటు బ్యాంకు దూరమైంది..' అని టీడీపీ నేతలు చెప్పడం వింటూనే వున్నాం. 

ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం టీడీపీ - బీజేపీ కలిసి అధికారంలో కొనసాగుతున్నాయి గనుక, ఇప్పటికిప్పుడు ఆ రెండు పార్టీల మధ్య చీలికకి ఛాన్సే లేదు. కానీ, 2019 ఎన్నికలకి మాత్రం పరిస్థితులు మారిపోనున్నాయన్నది నిర్వివాదాంశం. 2019 ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాదన్నది బీజేపీ అంచనా. అప్పటికి రాష్ట్రంలో మూడే ప్రధానమైన పార్టీలు వుంటాయి గనుక, వాటిల్లో టీడీపీ - వైఎస్సార్సీపీ అధికారం కోసం తలపడ్తాయి గనుక.. ఆ పోటీలో తాము 'డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌'గా మారతామని ఏపీ బీజేపీ నేతలే కాదు, జాతీయ స్థాయి బీజేపీ నేతలూ చెబుతున్నారు. 

ఇక్కడ డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌ అన్న మాటకి అర్థం సింపుల్‌. 'గోడ మీద పిల్లి' అన్న మాట. ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం వుంటే, వారితో అంటకాగడానికి బీజేపీ సిద్ధమైపోయింది. వైఎస్సార్సీపీకి ఎడ్జ్‌ కన్పిస్తే ఆ పార్టీతోనూ, మళ్ళీ టీడీపీకే ఎడ్జ్‌ వస్తే టీడీపీతోనే ఇంకోసారి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకూ బీజేపీ పక్కా వ్యూహంతో వుందన్నమాట. 

కొసమెరుపేంటటే, 2014 ఎన్నికల్లోనూ బీజేపీతో కలిసి పోటీ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఆ లెక్కన, ఆ రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తే, వైఎస్సార్సీపీకి ఎడ్జ్‌ ఆ ఎన్నికల్లో లభిస్తే, టీడీపీకి బీజేపీ వెన్నుపోటు తప్పదేమో.!