Home > Politics - Gossip
టీడీపీ ఓడితే... కరివేపాకుల జాబితా పెద్దదే!

నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలు అయితే.. కరివేపాకులుగా మిగిలిపోయే జాబితా పెద్దగానే కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ తరపున నంద్యాల్లో పని చేస్తున్న వారిలో ఎవరి స్వార్థం వారిది. ఇప్పుడు పార్టీ గెలిస్తే.. దాన్ని క్లైమ్‌ చేసుకోవాలని చాలామంది చూస్తున్నారు. కానీ, ఓడితే మాత్రం చంద్రబాబు చాలా మందిని విదిల్చి కొట్టనున్నాడు.

వారిలో ఫస్ట్‌ పేరు.. భూమా అఖిలప్రియ. నంద్యాల్లో ఓడితే, అఖిలప్రియ మంత్రి పదవికి ఎసరు రావొచ్చు. ఎలాగూ ఓడితే రాజీనామా చేస్తానని ఆమెనే ఛాలెంజ్‌ చేసింది కాబట్టి, రాజీనామా తప్పకపోవచ్చు. అంతేకాదు.. కనీసం ఆళ్లగడ్డ వరకూ అయినా అఖిలకు ప్రాధాన్యత దక్కుతుందా? అనేది ప్రశ్నార్థకం అవుతుంది.

ఎలాగూ అక్కడ గంగుల ఫ్యామిలీ వైకాపా తరపున ఉత్సాహంగా ఉంది కాబట్టి.. నంద్యాల్లో ఓడితే తెలుగుదేశంలో ప్రాధాన్యత తగ్గిపోవడమే కాదు, భూమా కుటుంబం రాజకీయ ప్రస్థానం కొశ్చన్‌ మార్క్‌ అవుతుంది. ఇక ఏవీ సుబ్బారెడ్డి.. భూమా ఫ్యామిలీ గనుక ఓడితే, ఈయన మళ్లీ రాజకీయ చదరంగంలో కనిపించకపోవచ్చు.

మరో కీలక వ్యక్తి ఎస్పీవై రెడ్డి. నంద్యాల్లో పార్టీ గెలిస్తే వచ్చేసారి తన అల్లుడికి ఎమ్మెల్యే టికెట్టో, ఎంపీ టికెట్టో సంపాదించుకోవాలని ఎస్పీవై రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఓడితే మాత్రం.. ఎస్పీవై రెడ్డిని కూడా బాబు కరివేపాకులా పక్కన పడేయోచ్చు. ఇక ఫరూక్‌ ప్రస్తుతానికి ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇక మండలి చైర్మన్‌ కలలో మాట అవుతుంది. ఆదినారాయణ రెడ్డి, అమరనాథ్‌ రెడ్డిలపై కూడా బాబుకు పూర్తి స్పష్టత వస్తుంది. వాళ్లను ఇక నియోజకవర్గాలకు పరిమితం కమ్మని సూచించే అవకాశం ఉంది. అలాగే కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి అడ్రస్‌ కూడా గల్లంతవుతుంది.

ఇక నంద్యాల బాధ్యతలు పుచ్చుకున్న టీజీ, కాలువ వంటి వాళ్లు కూడా తాము ట్రబుల్‌ షూటర్లం ఏమీకాదు అని బాబుకు స్పష్టతను ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవసరానికి వాడుకుంటాడు.. అనే పేరుంది చంద్రబాబుకు. నంద్యాల్లో ఇప్పుడదే జరుగుతోంది. ఇక్కడ టీడీపీకి ఎదురుదెబ్బ తగిలితే.. కరివేపాకుల సంఖ్య, రాజకీయంగా గల్లంతయిపోయే టీడీపీ నేతల సంఖ్య పెద్దగానే ఉంది.