Advertisement


Home > Politics - Gossip
కమలంవైపు చూస్తున్న తెదేపా కీలకనేత!

తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక నాయకుల్లో ఒకడు, అత్యంత వివాదాస్పద నాయకుల్లో కూడా  ఒకడు అయిన సుజనా చౌదరి కమలదళంతో జట్టుకట్టడానికి ఉత్సాహపడుతున్నట్లుగా అమరావతి రాజకీయ వర్గాల్లో కొత్తపుకారు వినిపిస్తోంది. తెలుగుదేశం ఆయన హవా బీభత్స గేర్ లోసాగుతూ ఉండగా.. ఇలాంటి పుకారు వినిపించినప్పుడు ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.

అయితే.. అదే సుజనాచౌదరి ముందుచూపునకు నిదర్శనం అని కూడా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. రకరకాల సమీకరణాలు, తన వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాలు ఇత్యాది అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని ఆయన భాజపా పంచన చేరి.. తన ఎంపీ పదవిని  పదిలంగా కాపాడుకోవడంతో పాటూ.. హస్తినలో ఇదే స్థాయిలో ఎప్పటికీ చక్రంతిప్పేలాగా ఉండాలని అభిలషిస్తున్నట్లుగా తెలుస్తోంది.

తెలుగుదేశానికి- భాజపాకు మధ్య వచ్చే ఎన్నికల్లోగా అంతరాలు ముదురుతాయో లేదో.. పొత్తులు మంటకలుస్తాయో లేదో తెలియదు. కానీ.. సుజనాచౌదరి ప్రస్తుత రాజ్యసభ ఎంపీ పదవి ముగిసిందంటే.. చంద్రబాబునాయుడు మరొక పర్యాయం అవకాశం కల్పించడం ఉండదనే విషయం మాత్రం స్పష్టం. రెండోసారి అవకాశం ఇస్తున్నప్పుడు ఈ సంగతిని స్పష్టంగా తేల్చిచెప్పినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఎటూ తెలుగుదేశంలో ఇక తనకు మరో అవకాశం ఇవ్వరు గనుక.. ఇక ఆ పార్టీని వీడి కమలం పంచన చేరడం బెటర్ అని ఆయన అనుకుంటున్నట్లుగా వినిపిస్తోంది. ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఆయన ఢిల్లీలో కాషాయ నాయకులతో చాలా మంచి సత్సంబంధాలనే ఏర్పాటు చేసుకున్నట్లు కూడా సమాచారం ఉంది. అందరితో మంచి సంబంధాలు కొనసాగిస్తూ.. తన స్వప్రయోజనాలు అన్నీ ఎంచక్కా నెరవేర్చుకుంటున్నారనే మాట వినిపిస్తూ ఉంటుంది.

పైగా ప్రత్యేకహోదాను మంటగలిపేసి.. ఎందుకూ కొరగాని ఒక ముష్ఠి ప్యాకేజీని అరుణ్ జైట్లీ ప్రకటించినప్పుడు.. ఏపీ తరఫున ఆయనతో భేటీ అయి దౌత్యం నెరపింది కూడా సుజనానే. ఆయన పేరుకు ఏపీ తరఫున అక్కడ ఉన్నప్పటికీ.. అంతా కమలదళం చెప్పిన దానికి తల ఊపి.. వారికి అనుకూలంగా.. ఏపీ ప్రభుత్వాన్ని బలవంతంగా ఒప్పించడం మినహా చేసిందేమీ లేదనే విమర్శలు కూడా ఉన్నాయి.

భవిష్యత్తులో ఆయన కమలదళం లో చేరడం జరిగితే గనుక.. ఏపీకి జరిగిన ద్రోహాలు మొత్తం ముందస్తు స్కెచ్ ప్రకారమే జరిగినట్లుగా భావించాల్సి ఉంటుందని పలువురు అంటున్నారు.