Advertisement


Home > Politics - Gossip
‘కత్తి’ ముద్దు.. సుప్రీం గొడవ వద్దే వద్దు

పవన్ కల్యాణ్ ను కత్తి మహేష్ తిడితే.. అది జాతికి చాలా ముఖ్యమైన అంశం.. దానిమీద మనం కొన్ని గంటల పాటూ టీవీ బులెటిన్లు నడపాల్సిందే.. చర్చాకార్యక్రమాలను నిర్వహించాల్సిందే.. అదే సమయంలో సుప్రీంకోర్టు వ్యవహారాల్లో ఉన్న లోటుపాట్ల గురించి సాక్షాత్తూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులే ప్రెస్ మీట్ పెట్టి.. జరుగుతున్న లోపాయికారీ విధానాల గురించి తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తే.. అది మనకు కీలకాంశం కాదు. తెలుగు మీడియాలో ఏవో ఒకటిరెండు ఛానెళ్లను మినహాయిస్తే.. శుక్రవారం నాడు మూకుమ్మడిగా కనిపించిన వైఖరి ఇది.

నిజానికి సుప్రీం న్యాయమూర్తుల ప్రెస్ మీట్ అనేది.. ఇవాళ దేశానికి అతి పెద్దసంగతి. ఈ దేశపు చరిత్రలోనే గతంలో ఎన్నడూ జరిగి ఉండని సన్నివేశం అది. ఆ న్యాయమూర్తులు చెప్పిన మాటలను బట్టే.. ప్రపంచదేశాల్లో కూడా బహుశా ఎక్కడా ఇలాంటి ప్రెస్ మీట్ జరిగి ఉండకపోవచ్చు. పైగా ఇంత తీవ్రమైన సంచలనాత్మకమైన ప్రెస్ మీట్ అనేది మన తెలుగువాడైన జస్టిస్ చలమేశ్వర్ ఆధ్వర్యంలోనే జరిగింది. సహజంగా అయితే.. తెలుగు మీడియాలో దీనికి సంబంధించిన కథనాలు చర్చలు హోరెత్తిపోవాలి. నేషనల్ మీడియా దీని ప్రాధాన్యాన్ని సరిగ్గానే గుర్తించింది గానీ.. తెలుగు మీడియా పట్టించుకోలేదనే విమర్శ ప్రజల్లో వినిపిస్తోంది.

ప్రజాస్వామ్యానికి మూడు మూలస్తంభాలుగా పరిగణించే వాటిలో.. న్యాయవ్యవస్థ చాలా కీలకమైనది. ఆ వ్యవస్థ పూర్తిగా చెదలు పట్టిపోయి ఉన్నదని.. అందులో ఉన్న బాధ్యతగల సీనియర్ వ్యక్తులే చెబుతున్నప్పుడు.. మీడియా దాని ప్రాధాన్యాన్ని అందిపుచ్చుకుని ఉండాలి. కొన్ని విషయాలనైనా.. కేవలం టీఆర్పీల కోసం కాకుండా.. నికార్సుగా ప్రజలకు, సమాజానికి మంచి జరగడం కోసం ప్లాన్ చేసి వేసి ఉంటే బాగుంటుందని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు.

ఒకటి రెండు చానెల్స్ మాత్రం.. లైవ్ సమయంలోను, ఆ తర్వాతి బులెటిన్లలోను  సుప్రీం వ్యవహారానికి సముచిత ప్రాధాన్యమే ఇచ్చాయి. తర్వాత ప్రయారిటీ తగ్గించేశాయి. కానీ మొత్తానికి ఈ ప్రెస్ మీట్ దేశాన్ని కుదిపేయబోతున్న అంశంగా  పలువురు భావిస్తున్నారు. సుప్రీం న్యాయమూర్తుల ప్రెస్ మీట్ చూసి.. కేంద్ర ప్రభుత్వం ఉలిక్కిపడి నష్టనివారణకు చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా పలువురు భావిస్తున్నారు. 

తెలుగు ఛానెళ్లు అంటే కత్తి మహేష్ లాంటి మరొకడు దొరికితే.. పండగ చేసుకుంటాయని.. తమకు ‘కత్తి’ ముద్దు.. సుప్రీం గొడవలు వద్దే వద్దు అన్నట్లుగా స్పందిస్తున్నాయని జనం నవ్వుకుంటున్నారు.