Advertisement


Home > Politics - Gossip
‘సర్వోన్నత’ సంక్షోభం!

భారతదేశ చరిత్రలోనే ఇది గతంలో ఎన్నడూ జరిగి ఉండని పరిణామం. సాక్షాత్తూ ప్రజాస్వామ్య మౌలిక వ్యవస్థ సవ్యంగా పరిఢవిల్లడానికి ఉండే మూడు స్తంభాల్లో ఒకటిగా భావించే న్యాయవ్యవస్థలో అతిపెద్ద సంక్షోభం ఇది. ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు)లోనే తలెత్తిన సంక్షోభం. దేశంలోని ఈ పరిణామం గురించి ప్రజలంతా నివ్వెరపోయేలా.. ఇతర దేశాలన్నీ కూడా ఒకసారి తలతిప్పి ఇటువైపు చూసేలా.. సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల మధ్య విబేదాల సంక్షోభం శుక్రవారం నాడు బట్టబయలైంది.

సుప్రీం చీఫ్ జస్టిస్ వ్యవహార సరళి సవ్యంగా లేదంటూ.. సుప్రీం కోర్టులోని నలుగురు సీనియర్ న్యాయమూర్తులు ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు గుప్పించడం, పరిస్థితిని ఇలాగే కొనసాగనిస్తే న్యాయవ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుందని ఆవేదన వ్యక్తం చేయడం, సుప్రీం న్యాయస్థానం పనితీరు విషయంలో.. కేంద్ర ప్రభుత్వం జోక్యం గురించి కూడా అనుమానాలు కలిగేలా ఆరోపణలు చేయడం.. ఇవాళ్టి న్యాయమూర్తుల విలేకరుల సమావేశంలో హైలైట్స్ గా ఉన్నాయి.

జస్టిస్ చలమేశ్వర్ నివాసంలో జరిగిన ఈ ప్రెస్ మీట్ లో మొత్తం నలుగురు సీనియర్ న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ దేశానికి స్వతంత్రంగా వ్యవహరించే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అవసరం ఉన్నదని.. ఈ నలుగురున్యాయమూర్తులు చెప్పడం గమనిస్తోంటే.. తెర వెనుక ఏదో జరుగుతున్నదనే అభిప్రాయం సామాన్యులకు కూడా కలిగేలా ఉన్నదని పలువురు భావిస్తున్నారు.

చీఫ్ జస్టిస్ ను అభిశంసించాలో వద్దో ఈ దేశ ప్రజలే నిర్ణయించాలంటూ.. నలుగురు న్యాయమూర్తులు విలేకర్ల సమావేశంలో చెప్పడాన్ని గమనిస్తే.. వారి అంతరంగం ఏమిటో అర్థమవుతున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కొలీజియం విషయంలోనూ తాము దారుణంగా విఫలంఅయ్యాం అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. తమకు ఇష్టం లేకపోయినా సరే.. వేరే గత్యంతరం లేకనే ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు కూడా వారు వివరించారు. న్యాయమూర్తులు మదన్ లోకుర్, కురియన్ జోసెఫ్, గొగోయ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సుప్రీం కోర్టు స్వేచ్ఛను కాపాడకపోతే.. ప్రజాస్వామ్యానికి మనుగడ ఉండదని  వారు పేర్కొనడం విశేషం.

సుప్రీం కోర్టు పరిపాలన వ్యవహారాలు సవ్యంగా జరగడం లేదంటూ వారు ఆరోపణలు చేశారు. సుప్రీం న్యాయమూర్తిని ఉద్దేశించి రాసిన 7పేజీల సుదీర్ఘమైన లేఖను వారు మీడియాకు విడుదల చేశారు. సమస్యల్ని పరిష్కరించాలన్న తమ వాదనతో సీజే ఏకీభవించడం లేదని వారు చెప్పారు. మొత్తానికి సుప్రీం కోర్టు వ్యవహారాల్లో న్యాయమూర్తుల మధ్య చరిత్రలో ఎన్నడూ సామాన్యుడి దృష్టికి రాని విధంగా పెద్ద సంక్షోభం నడుస్తున్నట్లుగా ఉన్నదని దీనిని బట్టి పలువురు అంచనా వేస్తున్నారు. 

ప్రభుత్వంలో సంచలనం..

సుప్రీం న్యాయమూర్తులు ఎన్నడూలేని రీతిలో ప్రెస్ మీట్ పెట్టడం.. ప్రభుత్వానికి కూడా కాకపుట్టేలా విమర్శలు గుప్పించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలో సంచలనం మొదలైంది. దీనిని సీరియస్ గా తీసుకున్న ప్రధాని మోడీ.. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో మాట్లాడారు. ప్రధానితో భేటీ అనంతరం.. ఈ సంక్షోభం మీద ప్రభుత్వ వైఖరి తెలియజేయడానికి న్యాయశాఖమంత్రి కూడా మీడియాతో మాట్లాడారు.