Advertisement


Home > Politics - Gossip
మోత్కుపల్లి.. తిట్టింది బాబునా, రేవంత్‌నా?

‘ఓటుకు నోటు కేసుతో పార్టీ పరువు తీశావ్.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఒక్క కార్పొరేషన్ కు పరిమితం అయ్యేలా చేశావ్.. తెలంగాణలో అంతమంది ఎమ్మెల్యేలు టీడీపీ తరఫున గెలిస్తే వాళ్లంతా టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయేలా చేశావ్.. తెలంగాణలో పార్టీని నాశనం చేశావు..’ ఇవీ మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడిన మాటలు. ఈ మాటలు ఎవరిని ఉద్దేశించినవో చెప్పకపోతే.. ఇవన్నీ తెలుగుదేశం అధినేత చంద్రబాబునో, లేకపోతే బాబు తనయుడు లోకేష్ బాబునో ఉద్దేశించినవి అవుతాయి! 

ప్రజలకు ఉన్న కనీస అవగాహన ప్రకారం.. పై పరిణామాలన్నింటికీ ప్రథమ బాధ్యులు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ బాబులే అవుతారు. ఓటుకు నోటు కేసు విషయం అంటారా.. దానికి సంబంధించి చంద్రబాబు ఎంత ఇబ్బంది పడ్డాడో అందరికీ తెలిసిందే. ‘బ్రీఫ్డ్ మీ..’ అనే వాయిస్ తనదో కాదో చెప్పలేకపోయాడు చంద్రన్న. ఓటుకు నోటు కేసు వ్యవహారం విచారణ సవ్యంగా జరిగి ఉంటే.. చంద్రబాబు ఏపీ సీఎంగా కొనసాగగలిగేవాడు కాదు.. అనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. 

ఇలాంటి నేపథ్యంలో.. ఆ కేసుతో పార్టీ పరువు తీసింది రేవంత్ రెడ్డి అని మోత్కుపల్లి అంటున్నాడు! అంతే కాదట.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ పరువు పోవడానికి కారణం రేవంతేనట! జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తిరిగింది ఎవరు? ఈ హైదరాబాద్ మా తాతది అని ప్రచారం చేసింది ఎవరు? అయితే.. ఆ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత మాత్రం రేవంత్ దేనట! ఇక ఎమ్మెల్యేలు టీడీపీని వీడి, తెరాసలోకి వెళ్లడం.. దీనికీ బాధ్యత రేవంత్ దేనట!! వీటన్నింటికీ బాధ్యత రేవంత్ దే అని మోత్కుపల్లి అంటున్నాడు. 

ఈ మాటల ద్వారా చంద్రబాబుపై తన విధేయతను ఈయన నిరూపించుకున్నాడు. అయితే ఈ విధేయత నిరూపించుకోవడం మాట ఎలా ఉన్నా.. ఈ మాటల్లో చంద్రబాబును, లోకేష్ ను దెప్పి పొడుస్తున్న ధ్వని అయితే వినిపిస్తోంది!