Advertisement


Home > Politics - Gossip
ఇద్దరు : విర్రవీగి బొక్క బోర్లా పడ్డారు!

దేశ రాజకీయాల్లో రెండు కీలక పరిణామాలు మంగళ వారం చోటు చేసుకున్నాయి. దేశంలోని రెండు కీలక పార్టీల్లో దాదాపుగా ఒకే సీజన్ లో చోటుచేసుకున్న రకరకాల పరిణామాలు.. అసంతృప్తులకు, అలకలకు, చీలికలకు కారణం కాగా, ఆయా పార్టీలపై అసలు పెత్తనం తమకే ఉన్నదని విర్రవీగిన ఇద్దరు నాయకులూ ఒకే రోజున ఖంగు తినాల్సి వచ్చింది. నేపథ్యాలు అచ్చంగా ఒకటే కాకపోయినా.. యాదృచ్ఛికంగా ఇద్దరికీ ఒకే రోజున ఎదురుదెబ్బ తగలడం విశేషం.

దేశంలో ఇటీవలి కాలంలో రెండు పార్టీలు చీలి ముక్కలయ్యాయి. మోడీ మార్కు రాజకీయ నీతికి ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ పార్టీలు బీహార్ లోని జేడీయూ, తమిళనాడులోని అన్నా డీఎంకే! ఈ రెండు పార్టీల్లో కూడా చీలిక తర్వాత రెండు మైనారిటీ వర్గాలు ఏర్పడ్డాయి. జేడీయూ లో జాతీయ అధ్యక్షుడు శరద్ యాదవ్ ఆ మైనారిటీ వర్గానికి నాయకుడు అయితే, ఇక్కడ తమిళనాడులో అన్నాడీఎంకే కు సంబంధించి.. టీటీవీ దినకరన్ ఆ పాత్ర పోషించారు. తన వెంట ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య మైనారిటీ నే అయినప్పటికీ.. తనదే అసలైన అన్నాడీఎంకే అని, రెండాకుల గుర్తును తనకే ఇవ్వాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కూడా ఆశ్రయించి నానా హడావిడి చేశారు. 

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తమిళనాట అన్నా డీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో శశికళను, టీటీవీ దినకరన్ ను పార్టీనుంచి బహిష్కరించారు. వారికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ఏకగ్రీవంగా తీర్మానించారు. జయలలిత మరణించగానే.. పెత్తనాన్ని తన చేతుల్లోకి తీసుకున్న శశికళ.. తనకు అనుకూలంగా పార్టీ కేడర్ హోదాల్లో చేసిన నియామకాలు అన్నిటినీ ఈ జనరల్ కౌన్సిల్ రద్దుచేసింది. దీంతో దినకరన్ వర్గానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. 

అక్కడ బీహార్ రాజకీయాల్లో కూడా అచ్చంగా ఇదే మాదిరి ఎదురు దెబ్బ జేడీయూలో మైనారిటీ వర్గం నాయకుడు అయిన శరద్ యాదవ్ కు తగిలింది. అసలైన జేడీయూ తనదే అని, ఎక్కువ మంది తన వెంటే ఉన్నారని ఆయన తొలినుంచి వాదించారు. ఆమేరకు ఎన్నికల సంఘాన్ని కూడా ఆశ్రయించి.. తనకే పార్టీపై సర్వాధికారాలు కట్టబెట్టాలని కోరారు. అయితే పార్టీ తనదే అంటూ.. దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించుకోలేకపోవడంతో.. శరద్ యాదవ్ విజ్ఞప్తిని ఈసీ తోసిపుచ్చింది. 

ఇక్కడ దినకరన్ బహిష్కరణ, అక్కడ శరద్ యాదవ్ విజ్ఞప్తి తిరస్కరణ రెండూ ఒకేరోజున చోటు చేసుకోవడం విశేషం. యాదృచ్ఛికమే కావొచ్చు గానీ.. తమాషా ఏంటంటే.. ఈ రెండు వ్యవహారాల్లోనూ విజయం సాధించిన వర్గాలకు తెరవెనుక మోడీ ప్రభుత్వం అండదండలు ఉన్నాయి.