Home > Politics - Gossip
ఆర్ఎస్ఎస్ ఒత్తిడి... యూపీలో ఓడిన మోడీ!

ఇంతకీ ఉత్తరప్రదేశ్ లో ఏం జరిగింది? అక్కడ భారతీయ జనతా పార్టీ సంచలన విజయం సాధించినంత వరకూ హ్యాపీగా ఉండిన మోడీని ఆ తర్వాతి పరిణామాలు ఖిన్నుడిని చేశాయా? పార్టీ సంచలన విజయం సాధించడంతో ఉప్పొంగిపోయిన ఆయన ఉత్సాహం మీద అంతే వేగంగా నీళ్లు చల్లారు ఆర్ఎస్ఎస్ పెద్దలు.. అనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. ఆర్ఎస్ఎస్ తీరు మోడీని తీవ్రంగా నిరాశ పరించిందని, అయితే ఆయన అంతకు మించి ఏమీ చేయలేని పరిస్థితి నెలకొని ఉందనే మాట వినిపిస్తోందిప్పుడు.

విషయం.. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం గురించి! బయటకు అయితే యూపీ బీజేపీలో ఆల్ ఈజ్ వెల్ అనే పరిస్థితి కనిపిస్తున్నా, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయంలో మోడీ, అమిత్ షాలు తమ మాటను నెగ్గించుకోలేకపోయారని తెలుస్తోంది. ప్రత్యేకించి ఇప్పటికే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యోగీ ఆదిత్యనాథ్ విషయంలో మోడీకి ఏమాత్రం సానుకూలత లేదని తెలుస్తోంది. ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం మోడీకి సుతారమూ ఇష్టంలేదని, అయితే ఆర్ఎస్ఎస్ పెద్దలు తమ ఒత్తిడితో ఆయనను ముఖ్యమంత్రిగా చేసినట్టుగా తెలుస్తోంది.

అసలు.. యోగి ముఖ్యమంత్రి అవుతాడని ఎవ్వరూ ఊహించలేదు. ఎన్నికల ముందు నుంచినే యోగి సీఎం పీఠంపై ఆశలైతే పెట్టుకున్ని ఉన్నారు. కొన్నాళ్ల కిందట యూపీ పర్యటనకు వెళ్లినప్పుడు మోడీని కొందరు సాధువులు కలిసి.. యోగిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కోరారు. అయితే.. అప్పుడు మోడీ స్పందించలేదు. 

ఆ తర్వాత యోగి ముఖ్యమంత్రి మంత్రి అభ్యర్థిత్వం విషయంలో ఆశలు పెట్టుకోవడం, దానికి మోడీ, షాలనుంచి సానుకూల స్పందన రాకపోవడం.. ఫలితంగా ఆయన కినుక వహించడం కూడా జరిగింది. యోగిని సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోవడంతో.. ఆయన అసమ్మతి వాదిగా కూడా తయారయ్యారు. ఆయన స్థాపించిన హిందూ యువవాహిని  అసెంబ్లీ ఎన్నికల్లో పలుస్థానాల్లో అభ్యర్థులను పోటీకి కూడా దించింది.

అదేమంటే.. యువవాహిని తనమాట వినడంలేదని యోగి చెప్పుకొచ్చారు. మరి ఆయన స్థాపించిన సంస్థ ఆయన మాట వినకపోవడం అంటే.. ఎవరి చెవుల్లో పూలు పెట్టినట్టు? అలాంటి రెబెల్స్ పెట్టేసరికి మీడియా కూడా ఇక యోగికి కష్టమే అని ఫిక్సయ్యింది. పార్టీని ఓడించడానికి కంకణం కట్టుకున్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తారని ఎవ్వరు ఊహిస్తారు. మరి అలాంటి ఊహకు అందనిది జరగడానికి కారణమంతా.. ఆర్ఎస్ఎస్ ఒత్తిడే అని తెలుస్తోంది.

మరీ కాషాయ చొక్కా వేసుకునే హిందూ అతివాదిని ముఖ్యమంత్రి చేయాలని మోడీకి కూడా లేదు. ఏ రాజ్ నాథ్ సింగ్ లాంటి వ్యక్తో అయితే.. మేలనే అభిప్రాయంతోనే ఆయన ఉండినారు. అయితే.. సంఘ్ పరివార్ మాత్రం యోగిని సీఎంగా చేయాల్సిందే అని పట్టుబట్టడంతో.. చేసేది లేక మోడీ కూడా సమ్మతించాల్సి వచ్చింది. మరి సంఘ్ ఒత్తిడితో ఇప్పటికే మోడీ మొహం మాడిపోయింది. యూపీలో బీజేపీ గెలిచి.. మోడీ ఓడినట్టు అవుతోంది. మరి ముందు ముందు యూపీలో ఏం జరగబోతోందో చూడాలి.