Home > Politics - Gossip
వాకాటి సస్పెన్షన్.. పాత రంకు బయటపడుతుందనే?

బ్యాంకులకు వందల కోట్ల రూపాయలకు పంగనామం పెట్టిన వాకాటి నారాయణ రెడ్డి ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయడం వెనుక తెలుగుదేశం అధినేతకు చుట్టుకున్న భయమే కారణం అని తెలుస్తోంది. వాకాటి ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి, “మా వాడు కాదు..’’ అనిపించేసుకుంటే, ఓ పనైపోతుంది! అలా కాకుండా.. ఆయనను పార్టీలోనే పెట్టుకుంటే.. విచారణలో మొత్తం కథ బయటకు వస్తుంది!

బ్యాంకులకు వందల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన వాకాటి ఆ సొమ్ముల్లో కొంత మొత్తాన్ని తను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు వినియోగించాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మొన్న నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాకాటి టీడీపీ తరపున గెలిచిన సంగతి తెలిసిందే. అక్కడ స్థానిక సంస్థల సభ్యుల బలాబలాల్లో టీడీపీకి తగిన మెజారిటీ లేకపోయినా.. వాకాటి గెలిచాడు!

హోరాహోరీన జరిగిన క్యాంపు రాజకీయంలో వాకాటి విజయం సాధించాడు. తగినంత మంది స్థానిక సంస్థల సభ్యులు లేకపోయినా.. వాకాటి గెలిచాడంటే, వైకాపాకు మెజారిటీ సభ్యులున్న జిల్లాలో తెలుగుదేశం గెలిచిందంటే.. దానికి డబ్బు ప్రభావమే కారణమని ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు.

ఒక్కో ఓటుకు ధరను ఫిక్స్ చేయడం వల్లనే తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. క్యాంప్ లను నిర్వహించి.. వైకాపా తరపున స్థానిక సంస్థల్లో నెగ్గిన వారికి భారీ మొత్తాలను ఆఫర్ చేసి.. తెలుగుదేశం తన అభ్యర్థిని గెలిపించుకుందనేది నెల్లూరు స్థానికుల అభిప్రాయం. నెల్లూరు ఎమ్మెల్సీ సీటు విలువ వంద కోట్ల రూపాయల పై మాటే! అనేది కూడా లోకల్ టాక్.

మరి బ్యాంకులను ముంచి దోచిన ఈ సొమ్మునే ఇలాంటి రాజకీయానికి ఉపయోగించి ఉండే అవకాశం ఉంది. ఇందులో నిజానిజాలు ఏమిటో తేలాలి అంటే.. వాకాటి వ్యవహారాలపై విచారణ జరపాల్సి ఉంది. ఈ విచారణ జరిగితే.. వాకాటి వ్యవహారంలో నెల్లూరు ఎమ్మెల్సీ ఎన్నిక కీలక ఘట్టం అవుతుంది. మొత్తం రంకంతా బయటపడే అవకాశాలుంటాయి. తీగ లాగితే డొంకంతా బయటపడే పరిస్థితి ఉంది.

అందుకే.. టీడీపీ వ్యూహాత్మకంగా వాకాటిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిందనే అభిప్రాయం వినిపిస్తోంది రాజకీయ వర్గాల్లో. వాకాటిని విచారిస్తే.. బ్యాంకులకు ఎగ్గొట్టిన సొమ్ముల్లో ఏది ఎటు పోయింది? ఎమ్మెల్సీ టికెట్ కు ఇచ్చిందెంత? ఒక్కో ఎంపీటీసీని ఎంత పెట్టి కొన్నారు? అనే అంశాలు వెలుగు చూసే అవకాశం ఉన్న క్రమంలోనే ఆయనను టీడీపీ నుంచి కిక్ చేశారని టాక్!