Home > Politics - Gossip
పాపం.. ఎలెక్టెడ్ వీపీ గారు ఏం సంపాదించుకోలేదట!

ఒకవైపు వెంకయ్య కోట్ల రూపాయలు కుప్పేసుకున్నాడు.. కూతురు ట్రస్టుతో, కొడుకు వ్యాపారాలతో వెంకయ్య కుటుంబం కోట్ల రూపాయలను కుప్పేసుకుంది అని కాంగ్రెస్ వాళ్లు ఆరోపిస్తున్నారు. వెంకయ్య వైస్ ప్రెసెడింట్ పోస్టుకు నామినేషన్ వేసిన దగ్గర నుంచి.. కాంగ్రెస్ ఆరోపణలు గుప్పుమన్నాయి.

మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న తమ పార్టీని అడ్డం పెట్టుకుని వెంకయ్య కూతురు భూములు పొందిందని, తెలంగాణలో తమకు అనువైన కేసీఆర్ ప్రభుత్వాన్ని అడ్డం పెటుకుని వెంకయ్యనాయుడు కొడుకు.. పెద్ద స్కామ్ లకు పాల్పడ్డారని కాంగ్రెస్ వాళ్లు గట్టి ఆరోపణలే చేశారు. వాటిపై వెంకయ్య వివరణ ఇచ్చినా.. అదంతా తప్పించుకునే యత్నమే తప్ప మరోటి కాదని.. కాంగ్రెస్సోళ్లు మళ్లీ ఎదురుదాడి చేశారు.

ఆ తర్వాత వెంకయ్య వాళ్లకు సమాధానం ఇవ్వలేదు కానీ, తాజాగా ఆయన ఒక బ్రహ్మాండమైన విషయాన్ని చెప్పారు. ఆ విషయం ఏమిటంటే.. దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నా.. తను పైసా కూడా సంపాదించుకోలేదట! ఇది వెంకయ్య గారి గురించి వెంకయ్య గారు చెప్పుకున్న మాట. సన్మానసభలు, ఆత్మీయ సత్కారాలతో బిజీగా ఉన్నారు వెంకయ్య. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని చెప్పారు. ఇన్నేళ్లు రాజకీయం చేసినా.. ఎప్పుడూ అనాపైసా సంపాదించుకోలేదని చెప్పారు.

మరి కాంగ్రెస్ వాళ్ల ఆరోపణల గురించి మాట్లాడకుండా.. తన కూతురి ట్రస్టుతో తనకు సంబంధం లేదు, కొడుకు వ్యాపారాలతోనూ సంబంధం లేదు.. అని చెబుతూ, తను మాత్రం సంపాదించుకోలేదని వెంకయ్య స్పష్టం చేశారు. నిజమే కదా.. కాంగ్రెస్ వాళ్లు కూడా ఈ ఎలెక్టెడ్ వీపీ పై ఆరోపణలు చేయలేదు.. ఆయన కొడుకూ, కూతురులు సంపాదించుకున్నారు.. అని మాత్రమే అన్నారు కదా!