Home > Politics - Gossip
వెంకయ్యకు జాక్ పాట్ తగులుతుందా?

కేంద్ర సమాచారశాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు త్వరలో జాక్‌పాట్ తగిలే అవకాశం ఉందా? ఇప్పటికే కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న ఆయన ప్రమోషన్ లభించి మరింత కీలకమైన శాఖలకు వెళ్లే అవకాశం తగలవచ్చునని ఢిల్లీ వర్గాల్లో ఒక చర్చ నడుస్తోంది. కేంద్ర కేబినెట్ లో ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత విశ్వసనీయులైన సహచరుల జాబితాలో ఉన్న వెంకయ్యకు అయిదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి అవకాశం తగలవచ్చునని పలువురు భావిస్తున్నారు. 

అయిదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో రెండుచోట్ల భాజపా తిరుగులేని మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే. మరో రెండు రాష్ట్రాల్లో కూడా తాము సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాకపోయినప్పటికీ.. ప్రభుత్వాలను మాత్రం భాజపానే ఏర్పాటు చేస్తోంది. గోవాలో పాజిటివ్ ఇమేజి కోసం మద్దతిస్తున్న చిన్నపార్టీల కోరిక మేరకు గతంలో అక్కడ సీఎంగా పనిచేసి, ప్రస్తుతం రక్షణమంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ ను వేరే గత్యంతరం లేక తిరిగి గోవా సీఎంగా పంపడానికి మోదీ సిద్ధపడ్డారు. అలాగే ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి పదవి మీద ఆశావహులు పెద్ద సంఖ్యలోనే ఉన్నప్పటికీ వారిలో అసంతృప్తులు రేగకుండా ఉండడానికి, కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ ను సీఎంగా చేసే అవకాశం ఉన్నదని వార్తలు వస్తున్నాయి. అంటే కేంద్ర కేబినెట్ కు ఒకేసారి హోంమంత్రి, డిఫెన్సు మంత్రి మారబోతున్నారన్నమాట. మనోహర్ పారికర్ తిరిగి గోవా వెళ్లడం వల్ల ఏర్పడిన ఖాళీని తాత్కాలికంగా అరుణ్ జైట్లీతో మోదీ భర్తీచేశారు. జైట్లీకి రక్షణశాఖ అదనపు బాధ్యతలు ఇచ్చారు. 

తాజాగా ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ఏంటంటే.. ఈ రెండు కీలక శాఖలను భర్తీ చేయడానికి మోదీకి అత్యంత విశ్వసనీయులైన సహచరుల్లో వెంకయ్యనాయుడుకు కూడా ఛాన్స్ తగలవచ్చునని. మోదీ అత్యంత విశ్వసనీయులుగా నమ్ముతూ ఆధారపడుతున్న కీలక మంత్రుల్లో అరుణ్ జైట్లీ తరువాత, వెంకయ్యనాయుడు పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తుంటుంది. పలు కీలక వ్యవహారాల్లో, క్రైసిస్ మేనేజిమెంట్ అవసరమయ్యే సందర్భాల్లో మోదీ, వెంకయ్యనాయుడు మీదనే ఆధారపడిన సందర్భాలున్నాయి. పట్టణాభివృద్ధి శాఖ మాత్రమే చూస్తున్న వెంకయ్యకు, ఇటీవలే సమాచార ప్రసార శాఖ కూడా ఇచ్చారు. ఇప్పుడు అంతకంటె కీలకమైన శాఖలు ఖాళీ అయితే... వెంకయ్యకు ఛాన్స్ తగిలినా ఆశ్చర్యం లేదని పలువురు భావిస్తున్నారు. అదే సమయంలో... సమాచార ప్రసార శాఖను వెంకయ్య చాలా సమర్థంగా నిర్వహిస్తూ.. దేశంలో ఉన్న అన్ని పత్రికలూ, అన్ని ఛానళ్లూ మోదీ భజన చేసేలా కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ పాత్రను వెంకయ్య అంత బాగా మరొకరు చేయలేరని మోదీ అనుకుంటే మాత్రం.. ఆయనకు సమాచార ప్రసారశాఖే ఉంటుందని... హోం, డిఫెన్సు కోసం మరొకరిని ఎంచుకుంటారని పలువురు భావిస్తున్నారు. ఎటు తిరిగి ఎటు వచ్చినా.. కేంద్ర కేబినెట్ లో ఇద్దరు సీనియర్లు తగ్గిన నేపథ్యంలో వెంకయ్య ప్రాధాన్యం పెరుగుతుందని, ఆయనకు జాక్ పాట్ తగలడమేనని పలువురు అనుకుంటున్నారు.