Home > Politics - Gossip
వెంకయ్య : ‘‘నాకు భజన చేయండి ప్లీజ్!’’

కేంద్రమంత్రిగా గద్దె ఎక్కిన తరువాత.. తెలుగు రాష్ట్రాలను ఉద్ధరించడంలో ఘనత వహించిన ముప్పవరపు వెంకయ్యనాయుడుకు ఇప్పుడు మరో ఘన సన్మానం జరగబోతోంది. ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు రూల్స్ కు కేంద్రం ఆమోదం తెలిపినందుకు, ఆ రకముగా కేంద్రప్రభుత్వం ఆమోదం తెలియజేయడానికి తగురీతిలో... చెమటోడ్చి కష్టపడినందుకు వెంకయ్యనాయుడుకు థాంక్స్ చెప్పుకుంటూ ఉపాధ్యాయ సంఘాలు విజయవాడలో ఆయనకు ఘనసన్మానం ఏర్పాటు చేశాయి.

ఇటీవలి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి చూసుకున్నా సరే.. కేంద్రంమంత్రి వెంకయ్యనాయుడుకు సన్మానాల పిచ్చి పట్టినట్టుగా మరెవ్వరికీ ఆ ఆసక్తి కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. అయినదానికీ కానిదానికీ పదేపదే సన్మానాలు చేయించుకుంటూ.. తద్వారా.. పూర్తవుతున్న ప్రతి పనీ తన ద్వారా మాత్రమే జరుగుతున్నాయనే భ్రమను ప్రజల్లో కలిగించడానికి వెంకయ్యనాయుడు నానా పాట్లు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. 

తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తున్నప్పుడు.. అయిదేళ్లు ప్రత్యేకహోదా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉంటే.. అలా ఎలా కుదురుతుంది? కనీసం పదేళ్లయినా హోదా ఇవ్వాల్సిందే అంటూ రాజ్యసభలో గొంతు చించుకున్న నాయకుడు వెంకయ్యనాయుడే! హోదా కూడా ఇవ్వకుంటే ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని ఆనాడు ఆయన చెప్పారు.

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. పదేళ్లు కాదు కదా... హోదా అనే అంశాన్నే పక్కన పెట్టారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘‘హోదా ఏమైనా సర్వరోగ నివారిణి అనుకుంటున్నారా’’ అంటూ ఎదురుదాడులు కూడా మొదలెట్టారు. అయితే హోదా విషయంలో ఆయన తీరు ఏపీకి ఎంత పెద్ద ద్రోహమో... తెలుగు ప్రజలు గుర్తించకుండా..  ఆయన లెక్కకు మిక్కిలిగా భజనపరుల్ని పోగేసుకుంటూ.. సన్మానాలు చేయించుకుంటున్నారనే వాదన ఒకటి రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. 

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏ ఊరిలో అడుగుపెడితే అక్కడ కేంద్రం తీసుకుంటున్న ఏదో ఒక నిర్ణయానికి ముడిపెట్టి సన్మానం చేయించుకుంటున్నారు. తాజాగా వ్యవస్థలో ఉన్న లోపాన్ని సరిదిద్దే నిర్ణయం కేంద్రం తీసుకుంటే, ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు రూల్స్ కు ఆమోదం తెలిపితే.. అది కూడా కేవలం తన ఘనతే అయినట్లుగా ఆయన సన్మానం చేయించుకోవడం విశేషం. 

అయితే విజయవాడలో వెంకయ్యనాయుడుకు ఉపాధ్యాయ వర్గాల సన్మానం విషయంలో చాలా మతలబు ఉన్నదిట. వివిధ పార్టీలకు చెందిన చాలా ఉపాధ్యాయ యూనియన్లు ఆయనకు సన్మానం చేయడానికి విముఖంగా ఉన్నాయిట.

అందులో పాల్గొనడానికి కూడా ఇష్టపడడం లేదుట. అలా చేస్తే.. ఈ విషయంలో క్రెడిట్ మొత్తం వెంకయ్యకే కట్టబెట్టినట్టు అవుతుందని, నిజానికి ఆయన చేసిందేమీ లేదని కొన్ని యూనియన్లు వాదిస్తున్నాయట. మొత్తానికి ఏదోరీతిగా, కనీసం సొంత పార్టీ యూనియన్ ద్వారా అయినా  సన్మానం చేయించుకోవడం మాత్రం తథ్యంగానే ఉంది. 

వెంకయ్యనాయుడులో ఈ సన్మానాల మోజేమిటో అర్థం కావడం లేదు. ‘‘నేను మాత్రం మోడీకి భజన చేస్తూ.. ఈ జీవితాన్ని తరింపజేసుకుంటా... నా జన్మను చరితార్థం చేసుకుంటా. కానీ మీరందరూ మాత్రం నాకు భజన చేస్తూ ఉండండి... నా జన్మ ఇంకాస్త దివ్యమైనది అనే నమ్మకాన్ని నాకు ప్రసాదించండి...’’ అంటూ ముప్పవరపు వెంకయ్యనాయుడు మందిని వేడుకుంటున్నట్లుగా ఈ కామెడీ సన్మానపు కార్యక్రమాలు విచ్చలవిడిగా నడుస్తున్నాయి.