Advertisement


Home > Politics - Gossip
'వెన్నుపోటు' అనుభవమే పవన్‌కి నచ్చిందా.?

పదవి కావాలంటే అనుభవం తప్పనిసరి.. అని అంటున్నారు సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌. రాజకీయాల్లో అనుభవం అవసరమే. కానీ, అదే రాజకీయాలకు ప్రామాణికం కాదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఏ అనుభవంతో రాజకీయంగా అత్యున్నత స్థానానికి ఎదిగారట.? కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి, అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి అవ్వగలిగారాయన. ఇది ఈ మధ్యకాలంలో జరిగిన అద్భుతం. 

తెలుగు రాజకీయాల్లో స్వర్గీయ ఎన్టీఆర్‌ ఓ సంచలనం. రాజకీయాల్లో ఆయనకు ఏం అనుభవం వుందని, పార్టీ పెట్టగానే ముఖ్యమంత్రి అయ్యారట.! ఏడాదిలో రెండు మూడు సార్లు మాత్రమే జనంలోకి వెళ్ళాలని అనుకున్నారో ఏమోగానీ, తన ఫ్రస్ట్రేషన్‌ అంతా వెల్లగక్కుకోవడానికి రాజకీయాల్ని పవన్‌కళ్యాణ్‌ వేదికగా మలచుకోవడం ఆశ్చర్యకరం. జగన్‌ విషయంలో 'అనుభవం' గురించి ప్రశ్నించేశారు పవన్‌కళ్యాణ్‌. 

నిజానికి, 2009 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్‌ నుంచి దక్కిన పార్లమెంటు సభ్యత్వాన్ని కాదనుకుని, సొంతంగా ఎన్నికల్లో నిలబడి, ఘనవిజయం అందుకున్నారాయన. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవి గురించి ఆలోచించడం తప్పెలా అవుతుంది.? చిరంజీవి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిపోదామనుకుంటే, అది తప్పు కాదట. తండ్రి ముఖ్యమంత్రి కాబట్టే, తానూ ముఖ్యమంత్రి అవ్వాలనుకోవడం జగన్‌ తప్పిదమట.! 

సరే, జగన్‌ విషయం పక్కన పెడదాం.. పవన్‌కళ్యాణ్‌ వెనకేసుకొస్తోన్న చంద్రబాబు సంగతేంటట.? టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావుని వెన్నుపోటు పొడిచి, అధికారం దక్కించుకున్న చంద్రబాబులో పవన్‌కళ్యాణ్‌కి ఏ క్వాలిటీ నచ్చిందో ఏమో. బహుశా 'వెన్నుపోటు' అనే అనుభవమే, చంద్రబాబులో పవన్‌కళ్యాణ్‌కి బాగా నచ్చి వుంటుంది. 

ప్రజా క్షేత్రంలో నిలిచి ఎంపీగా, ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన జగన్‌కి అనుభవం లేదుగానీ, ప్రజలతో సంబంధం లేకుండా నామినేటెడ్‌ పోస్ట్‌ దక్కించుకుని, ఎమ్మెల్సీగా మంత్రిగా పదవులు దక్కించుకున్న లోకేష్‌లో ఏదో క్వాలిటీ చంద్రబాబుకి నచ్చేసింది.. అది పవన్‌కళ్యాణ్‌కీ అర్థమయ్యింది. వింతగా వుంది కదూ.! 

పవన్‌కళ్యాణ్‌ నిస్వార్ధంగానే ప్రజల్లోకి వస్తున్నాడేమో.. అన్న చిన్నపాటి అనుమానం ఎవరికన్నా వుంటే, దాన్ని పటాపంచలు చేసేస్తూ.. చంద్రబాబు డైరెక్షన్‌లోనే తాను రాజకీయ తెరపై కన్పిస్తున్నానని జనసేనాని పదే పదే నిరూపించేసుకుంటుండడం విశేషమే మరి. కన్‌ఫ్యూజన్‌ లేకుండా ఈ విషయంలో పవన్‌ జనానికి ఫుల్‌ క్లారిటీ ఇచ్చేస్తున్నారండోయ్‌.!