Advertisement


Home > Politics - Gossip
వెన్నుపోటు - ఓటుకు నోటు.!

వెన్నుపోటుకి 'అధికార మార్పిడి' అనే 'అందమైన' పేరు చంద్రబాబు తప్ప ఇంకెవరైనా పెట్టగలరా.? పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచి, అధికారం దక్కించుకున్న 'అల్లుడు' దేశ చరిత్రలోనే ఇంకెవరూ కన్పించరేమో.! దటీజ్‌ 'నిప్పు' నారా చంద్రబాబునాయుడు. ఏ ఎన్టీఆర్‌ని అయితే కంటతడి పెట్టించారో, ఏ ఎన్టీఆర్‌ మీద అయితే చెప్పులు వేయించారో, ఏ ఎన్టీఆర్‌ని అయితే గద్దె దించారో.. అదే ఎన్టీఆర్‌ ఫొటో పెట్టుకుని రాజకీయం చేస్తున్న ఘనత ఖచ్చితంగా చంద్రబాబుదే.! 

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల్ని రాజకీయ వ్యభిచారంతో పోల్చిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పార్టీ ఫిరాయింపులు 'అభివృద్ధి కోసం' అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. చంద్రబాబు తీరే అంత. ఆయన ఏదన్నా చెయ్యొచ్చు, అదే పని ఇంకొకళ్ళు చేస్తే మాత్రం అత్యంత తీవ్రంగా స్పందించేస్తుంటారు.. 'రాజకీయ వ్యభిచారం' లాంటి దారుణమైన మాటలు వాడేస్తారు. 

ఇక, ఇప్పుడు 'ఓటుకు నోటు' కేసు విషయంలోనూ చంద్రబాబు అండ్‌ కో సరికొత్త పదాన్ని కనిపెట్టేందుకు సమాయత్తమవుతోంది. ఓటుకు నోటు కేసులో ప్రధమ నిందితుడు రేవంత్‌రెడ్డి, టీడీపీని వీడడం ఖాయమైపోవడంతో ఆ కేసు విషయమై ప్రస్తావించలేక ప్రస్తుతానికి తెలంగాణ టీడీపీ నేతలు నానా తంటాలూ పడ్తున్నారు. 'ఆ ఘటన తర్వాత పార్టీ భ్రష్టు పట్టిపోయింది.. అది రేవంత్‌రెడ్డి దూకుడుతో జరిగిన వ్యవహారమే..' అంటున్నారు మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్‌కుమార్‌గౌడ్‌ తదితర టీడీపీ ముఖ్య నేతలు. 

బాబుగారు 'బ్రీఫింగ్‌' చేయకుండా, రేవంత్‌రెడ్డి - టీఆర్‌ఎస్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్యేతో ఐదు కోట్లకు బేరం కుదుర్చుకున్నారా.? ఛాన్సే లేదు. దానికి సంబంధించి ఆడియో టేప్‌ ఒకటి ఆల్రెడీ ప్రాచుర్యంలో వుంది. చంద్రబాబు తన తెలివితేటలతో ఓటుకు నోటు కేసుని - ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుతో ప్రస్తుతానికి నీరుగార్చినా, నిజం మాత్రం జనానికి ఎప్పుడో అర్థమయ్యింది. 

ఎలాగైతేనేం, తిమ్మిని బమ్మిని చేయడంలో చంద్రబాబు దిట్ట. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అందుకే వెన్నుపోటుకి అధికార మార్పిడి అనే గొప్ప పేరు పెట్టిన చంద్రబాబు, ఓటుకు నోటు వ్యవహారానికీ ఓ మాంఛి పేరు పెట్టేందుకు సన్నద్ధమవకుండా వుంటారా.? అది ఏమై వుంటుందబ్బా.!