Advertisement


Home > Politics - Gossip
సొంత ఊర్లో వెంకయ్య : ఏకంగా ఓ వారం!

ఉపరాష్ట్రపతి అంటే.. చాల పెద్ద ప్రోటోకాల్ వ్యవహారం ఉంటుంది. ప్రతికదలిక నిఘా కళ్ల మధ్య జరుగుతూ ఉంటుంది. ఆయన పర్యటనలో ఉన్నంత కాలమూ.. అధికార్లకు ముచ్చెమటలు పడుతూ ఉంటాయి..! అలాంటి పరిస్థితి ఇప్పుడు నెల్లూరు జిల్లా అధికార్లకు ఓ వారం పాటు తప్పేలా లేదు. తాను దేశానికి ఉపరాష్ట్రపతి అయిన తర్వాత సంక్రాంతి పండుగను సొంత ఊరిలో సెలబ్రేట్ చేసుకోవడానికి.. ఏకంగా వారం రోజులపర్యటనగా వేంచేసిన ఉపరాష్ట్రపతి గౌరవ మర్యాదలు, భద్రతకు భంగం వాటిల్లకుండా.. కసరత్తు లు చేయడంలో అధికార్లు తలమునకలై ఉన్నారు.

వెంకయ్యనాయుడు నెల్లూరు జిల్లానుంచి అంచెలంచెలుగా ఎదిగిన సీనియర్ రాజకీయవేత్త. కొన్ని దశాబ్దాలుగా ఆయన ఢిల్లీ రాజకీయాలకే పరిమితమై.. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ.. తాను ఢిల్లీ వర్గాల్లో చక్రం తిప్పే కీలకమైన స్థాయిలోనే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇవాళ ప్రధానిగా ఉన్న నరేంద్రమోడీ.. గుజరాత్ సీఎం అయిన.. తొలిరోజుల్లో.. చిన్నస్థాయి నేతగా ఉన్నప్పటికే.. వెంకయ్యనాయుడు భాజపాకు జాతీయ అధ్యక్షుడి స్థాయిలో హోదా వెలగబెడుతున్నారు.

అప్పటినుంచి నిత్య రాజకీయ కార్యభారంతో ఆయన చాలా బిజీగానే ఉండేవారు. ప్రభుత్వంలోకి తమ పార్టీ వచ్చిన తర్వాత.. అస్సలు ఖాళీలేదు. కీలక శాఖలు చేతిలో ఉన్నాయి. నిత్యం పనుల ఒత్తిడి. ఇన్నింటి మధ్య ఆయనకు స్వస్థలం, స్వరాష్ట్రం మీద ఎంత మక్కువ ఉన్నా ఒకటిరెండు రోజులకు మించి కేటాయించగలిగేవారు కాదు.

కానీ ఇప్పుడు ఆయన భారత ఉపరాష్ట్రపతి. వెంకయ్యానాయుడు చాలా చొరవ, దూకుడు ఉన్న ప్రజానాయకుడు గనుక.. ఆయన నిత్యం ఏదో ఒక కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు గానీ.. వాస్తవంలో ఉపరాష్ట్రపతికి ఎక్కువ ఖాళీ సమయమే ఉంటుంది. రాజ్యసభ సమావేశాలు లేని సమయంలో పూర్తి ఖాళీనే లెక్క. ఇప్పుడు శీతాకాల సమావేశాలు కూడా పూర్తయ్యాయి గనుక.. వెంకయ్యనాయుడు  ప్రశాంతంగా ఓ వారం రోజులు సొంత ఊరిలో గడపడానికి వచ్చేసినట్లుగా కనిపిస్తోంది.

అంతమాత్రాన ఆయన ఖాళీగా ఉండబోవడం లేదు. పండగ రోజు తప్ప.. ప్రతిరోజూ అధికారిక కార్యక్రమాల షెడ్యూలు పెట్టుకున్నారు. ఆయన బాగా ఇష్టపడే సత్కారాలు, సన్మానాలు ఎటూ ఉండనే ఉన్నాయి. ఈ వారం రోజులూ.. నెల్లూరు జిల్లా మొత్తం వెంకయ్య కార్యక్రమాల హడావిడితో హోరెత్తిపోవడం ఖాయం. ఆయనకు  లోటు రానివ్వని ఏర్పాట్ల పర్యవేక్షణలో అధికారగణాలు బేజారెత్తిపోవడం కూడా ఖాయం అని పలువురు అనుకుంటున్నారు.