Home > Politics - Gossip
వెస్ట్ గోదావరిలో మళ్లీ వర్మ చిచ్చు?

ఆంధ్ర అంటేనే ఇప్పుడు కుల రాజకీయాలకు పెట్టింది పేరు. ఆ మాటకు వస్తే ఏ రాష్ట్రమైనా అదేతంతు. అయితే మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రతి కులాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడింది.  తనకున్న సామాజిక వర్గానికి తోడుగా, కాపులను, బిసిలను దగ్గరకు తీసుకుంటూనే, సంఖ్యాబలంలో ఎక్కువ కాకపోయినా, క్షత్రియులను కూడా వీలయినంతగా దగ్గరకు తీసుకుంటోంది.

మొన్నటి ఎన్నికల్లో గెలవగానే అశోక్ గజపతి రాజును కేంద్రమంత్రిని చేసారు. అవకాశం వచ్చినపుడల్లా క్షత్రియులకు తను అనుకూలం అని చాటుకుంటూనే వుంది. దీనికి కారణం, మొన్నటి ఎన్నికల్లో వెస్ట్ గోదావరిలో క్షత్రియులు, కాపులతో కలిసి మరీ తెలుగుదేశం గెలుపుకోసం పనిచేయడమే. దాని ఫలితంగా టోటల్ సీట్లు తెలుగుదేశం వశమయ్యాయి. క్షత్రియుల ద్వారా వెస్ట్ ను, కాపుల ద్వారా ఈస్ట్ ను, వెలమల ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోనూ కాస్త లీడ్ తీసుకోవాలన్నది తెలుగుదేశం స్ట్రాటజీ. కృష్ణ, గుంటూరులో స్వంత సామాజికవర్గ అండ ఎలాగూ వుంటుంది.

అయితే టాలీవుడ్ లో సంభవిస్తున్న పరిణమాలు, ఫ్యాన్స్ హడావుడులు, పైగా రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ల కామెంట్ లు కలిసి, ఇప్పుడు వెస్ట్ గోదావరిలో క్షత్రియులు, కాపుల మధ్య ఎడాన్ని మళ్లీ పెంచుతున్నాయి. బాహుబలి పార్ట్ వన్ టైమ్ లోనూ, సర్దార్ గబ్బర్ సింగ్ విడుదుల టైమ్ లోనూ ప్రభాస్ ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ నడుమ చిన్న చిన్న వివాదాలు చెలరేగాయి. ఆ తరువాత సద్దు మణిగాయి.

పైగా వెస్ట్ గోదావరిలో వైకాపా ఓ ఫుడ్ పార్క్ విషయంలో బాధితుల సైడ్ తీసుకుంది. కానీ అవతలి పార్టీ క్షత్రియులు కావడం విశేషం. దీంతో జిల్లాలో మళ్లీ క్షత్రయులకు కాపులకు మధ్య రాజకీయంగా ఎడం పెరుగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

బాహుబలి-2 ట్రయిలర్ సందర్భంగా డైరక్టర్ చేస్తున్న కామెంట్ లు ఇప్పుడు ఈ రెండు కమ్యూనిటీల నడుమ ఎడాన్ని పెంచేలా వున్నాయి. ఎందుకంటే పవర్, మెగా, సూపర్ అంటూ విశేషణాలు వాడి, వారు ప్రభాస్ కాలి గోటికి పనికిరారు అన్న కామెంట్ చిన్నా చితకా కామెంట్ కాదు. మెగా, పవర్ లకు కాపుల్లోనూ, ప్రభాస్ కు క్షత్రియుల్లోనూ ఫ్యాన్ బేస్ వుంది. ఇప్పుడు ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య వర్మ కామెంట్ లు మరింత విభేధాలు సృష్టిస్తాయి.

మొన్నే కాటమరాయుడు టీజర్ కొత్త రికార్డులు సృష్టిస్తే, దాన్ని బాహుబలి-2 చిటికెలో తీసి పక్కన పడేసింది. ఇదిలా సైలెంట్ గా వదిలేస్తే ఏమో కానీ, వర్మలాంటి వాళ్లు ఇలా ఆజ్యంపోయడం మాత్రం కాస్త ఇబ్బందే. అసలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భాజపాకు, మోడీకి దూరం అంటున్నాడు. ప్రభాస్ పెదనాన్న భాజపాలో వున్నారు. రాజకీయంగా వేరు, సినిమాల పరంగా వేరు అంటూ ఇలా కాపులు, క్షత్రియులు ఎడం అయితే, సుబ్బి పెళ్లి ఎంకిచావుకు వచ్చినట్లు అవుతుంది. తెలుగుదేశం పరిస్థితి.

కాపులు-క్షత్రియులు కలిసి పనిచేస్తే తెలుగుదేశానికి మోదమే, కానీ వేరువేరుగా పనిచేస్తే, దాని ఎఫెక్ట్ కాస్త గట్టిగానే వుంటుంది.