Home > Politics - Gossip
బాబు - బ్రాండ్ అంబాసిడర్లు ఏం సాధించారని?

ఒక రంగానికి అనూహ్యమైన క్రేజ్ తీసుకురావడానికి, పాపులారిటీ పెంచడానికి ఏదో ఒక రంగంలో సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుని వారి ప్రచారం ద్వారా అనుకున్నది సాధించడం మామూలే. పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీల ఈ ప్రచార శైలిని ప్రభుత్వాలు కూడా అందిపుచ్చుకుంటున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం.. చేనేత రంగానికి సమంతను బ్రాండ్ అంబాసిడర్ గాచేసి.. చాలా కార్యక్రమాలే నిర్వహిస్తోంది.

వీరిని చూసి స్పందించినట్లుగా చంద్రబాబునాయుడు కూడా ఏపీలో చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్ ను నియమించేశారు. కాకపోతే.. పాపులారిటీ విషయంలో ఎంతో తేడా ఉన్న ఒకనాటి హీరోయిన్ పూనం కౌర్ ను ఆయన ఈ హోదాలో పెట్టారు.

ఈ సంగతి పక్కన పెడితే అసలు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ల ద్వారా ఈ ప్రభుత్వం గద్దె ఎక్కిన తర్వాత ఇప్పటిదాకా ఏ చిన్న ప్రయోజనం అయినా నెరవేరిందా? అనేది సందేహంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఇలాంటి బ్రాండ్ విఫల ప్రయోగాలను చంద్రబాబు సర్కారు గతంలో కూడా అనేకం చేసింది. కానీ ఇప్పటిదాకా ప్రజలకు గాని, ప్రభుత్వానికి గాని ఏం ఒరిగిందో ఎవ్వరికీ తెలియదు.

ప్రభుత్వంలోకి వచ్చిన కొత్తల్లో వైద్యఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చాలా ఆర్భాటంగా.. ఏపీ వైద్య శాఖకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి అమితాబ్ బచ్చన్ అంగీకరించారని ఆర్భాటంగా ప్రకటించారు. ఆయన ప్రచారంతో.. మన వైద్య రంగానికి చాలా మేలు జరుగుతుందని కూడా చెప్పారు. కానీ.. ఇప్పటిదాకా  అమితాబ్ ఆ ఊసు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం ఏపీలో ఒకమారైనా కాలు కూడా మోపలేదు. గుజరాత్ టూరిజంకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న అమితాబ్ వారికి రెగులర్ గా అనేక యాడ్స్ చేస్తుంటారు. కానీ.. ఏపీ తనంత తాను ప్రకటించుకున్నదే గానీ.. వీరి వైద్య రంగం గురించి ఆయన ఏనాడూ దృష్టి పెట్టలేదు. 

అలాగే ఆతర్వాత ఇలాంటిదే మరో ప్రహసనం జరిగింది. ఏదో వ్యాపార ప్రపోజల్ తీసుకువచ్చి, అమరావతిలో భూములు అప్పనంగా పొందడం కోసం బాలీవుడ్ జంట అజయ్ దేవగన్, కాజోల్ వచ్చి చంద్రబాబునాయుడును కలిశారు. వారికి విందుభోజనమూ, సత్కారాలూ చేసిన తర్వాత.. ఈ జంట ఇద్దరూ ఏపీ టూరిజం శాఖకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటారని చంద్రబాబు ప్రకటించేశారు. ఆ సందర్భంలో.. తమ ఆబ్లిగేషన్ కోసం వచ్చారు గనుక.. వారు కూడా అదే ప్రెస్ మీట్ లో ‘అవును ఉంటాం’ అంటూ అంగీకరించేశారు. అప్పటినుంచి ఈ రోజు దాకా ఏళ్లు గడుస్తున్నా.. ఆ జంట ఏపీ టూరిజం కోసం పల్లెత్తు మాట ప్రచారం చేసింది కూడా లేదు. 

ఇప్పుడు తాజాగా పూనం కౌర్ చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్ అంటున్నారు. నిజానికి తెలంగాణలో సమంత చేనేత రంగానికి చాలా దన్నుగా పనిచేస్తోంది. అదే స్థాయిలో పూనం కౌర్ చేయగలదా? అసలు ఆమె చేసే ప్రచారానికి ఫలితం ఉంటుందా? అసలు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ల ప్రయత్నం ఫలిస్తుందా? అనేది అనుమానమే.