Home > Politics - Gossip
అనుసంధానంలో చెప్పినవన్నీ అబద్ధాలేనా?

పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా గోదావరి నది నీళ్లను కృష్ణలోకి తీసుకువస్తున్నారు. ఇదివరకు దాదాపుగా పూర్తయిన కాలువలనే వాడుకుంటూ.. ఎత్తిపోతలను మాత్రం ఏర్పాటుచేసి.. నీళ్లను తీసుకురావడం ద్వారా.. పట్టిసీమ పనులు చేయడం ద్వారా ఏకంగా పోలవరం ప్రాజెక్టునే పూర్తి చేసేసినంత స్థాయిలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఇప్పటికీ టముకు వేసుకుంటూనే ఉన్న సంగతి అందరికీ తెలుసు.

దేశంలోనే వాజపేయి కాలంనుంచి కలగంటూ ఉన్న నదుల అనుసంధానానికి చంద్రబాబునాయుడు మొట్టమొదటి అడుగు వేశారంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు చెప్పుకుంటున్నది. నదుల అనుసంధానం అనే పర్వానికి చంద్రబాబే తొలి శ్రీకారం దిద్దినట్లుగా చెప్పుకుంటూ ఉన్నది. అయితే తాజాగా వెల్లడవుతున్న కొన్ని విషయాలు.. ఈ కబుర్లన్నీ అబద్ధాలేనా అనే అనుమానాలు కలిగిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ కి చెందిన నాయకుల్లో.. కాస్త విషయ పరిజ్ఞానంతో మాట్లాడే వాళ్లలో ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి కూడా ఒకరు. ఆయన నదుల అనుసంధానం అనే దానికి సంబంధించి అనేక కొత్త విషయాలను వెల్లడిస్తున్నారు. నిజానికి ఇవి చాలా పాత విషయాలు. అందరికీ తెలిసిన విషయాలే కానీ.. ఈ కోణంలో ఎన్నడూ  పరిశీలించి ఎరగని విషయాలు. వాటిని తులసిరెడ్డి చెబుతున్నట్లుగా గమనించినప్పుడు నదుల అనుసంధానం విషయంలో చంద్రబాబు చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలేనా అనే సందేహాలు కలుగుతాయి.

తులసిరెడ్డి చెబుతున్న మాటల ప్రకారం.. బ్రిటిషోళ్ల కాలంలో బకింగ్ హాం కాలువ ద్వారానే గోదావరీ – కృష్ణ నదుల అనుసంధానం జరిగిందని అంటున్నారు. అప్పటి బ్రిటిష్ అధికారి కాటన్... కేసీకెనాల్ గ్రావిటీ ద్వారా తుంగభద్ర పెన్నా నదుల అనుసంధానం కూడా చేశారని ఆయన చెబుతున్నారు. కాంగ్రెస్ హయాంలో తుంగభద్ర పెన్నా హెచ్ఎల్సీ ద్వారా తుంగభద్ర- పెన్నా- చిత్రావతి నదుల్ని కూడా అనుసంధానం చేసిన చరిత్ర ఉందని ఆయన అంటున్నారు. తులసిరెడ్డి చెబుతున్నవి రాజకీయ నిర్ణయాలు కాదు.. ఏదో ఓర్వలేక చెబుతున్నారని అనుకోవడానికి! అచ్చంగా ఇప్పటికీ ఇవన్నీ మన కళ్ల ముందు కనిపిస్తున్నవే. ఆ యన చెబుతున్న ప్రకారం నదుల అనుసంధానానికి నిదర్శనాలే.

మరి తులసిరెడ్డి చెబుతున్న సంగతులను బట్టి.. పట్టిసీమ పుణ్యమంటూ నదుల అనుసంధానం అంటూ ఇన్నాళ్లుగా చంద్రబాబునాయుడు చెప్పుకుంటున్నదంతా అబద్ధాలేనా? అతిశయోక్తులేనా? అనే అనుమానం కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల వాయిస్ కు ఈ రాష్ట్రంలో విలువ లేకుండా పోయింది గానీ.. ప్రభుత్వప్రచారంపై ఇది సూటి విమర్శ కాగల అవకాశం ఉంది.