Advertisement


Home > Politics - Gossip
కేటీఆర్ వెళ్తోంటే.. చినబాబు వెళ్లకుంటే ఎలా?

దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది రాజకీయ నాయకులు తమ కీర్తిని పెంచుకోవడానికి ఒక మెట్టుగా వాడుకునే అంశం. సాధారణంగా దావోస్ లో జరిగే ఈ సదస్సుకు ముఖ్యమంత్రి స్థాయి నాయకులకు, కేంద్ర మంత్రుల స్థాయి వారికి మాత్రమే ఆహ్వానం వస్తూ ఉంటుంది.

కానీ ఈ దఫా జనవరి 17, 18తేదీల్లో జరగబోతున్న సమావేశానికి తెలంగాణ లోని ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం వచ్చింది. కేటీఆర్ ట్రాక్ రికార్డు వివిధ అంతర్జాతీయ సదస్సులను ఆయన నిర్వహించిన తీరు ఇత్యాది అంశాలను పరిగణనలోకి తీసుకుని.. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లుగా నిర్వాహకులు కేటీఆర్ కు లేఖ పంపారు...

ఇదంతా పాత వార్త. కొన్ని రోజుల కిందట వచ్చేసిన వార్త. అయితే... తెలంగాణ యువరాజు కేటీఆర్ దావోస్ సదస్సుకు వెళుతుండగా.. ఏపీ లో ఉన్న యువరాజు లోకేష్ వెళ్లకపోతే ఎలాగ? ఈ ఆలోచన అక్కడి వారికి కూడా వచ్చింది. అందుకే ఆగమేఘాల మీద రంగం సిద్ధం చేశారు. ఎంత చేసినా. దావోస్ సదస్సు నిర్వాహకుల నుంచి అధికారికంగా లోకేష్ కు ఆహ్వానం తెప్పించడం వారికి సాధ్యం కాలేదు. దీంతో.. ఏపీ ప్రభుత్వమే దావోస్ లో ఒక ఐటీ ఆధారిత పరిపాలన గురించిన సదస్సును స్పాన్సర్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఆ సదస్సు రూపేణా లోకేష్ కూడా దావోస్ కు వెళ్తారన్నమాట. కానీ ఏదో కేటీఆర్ కు పోటీగా.. తాను కూడా దావోస్ వెళ్తానని లోకేష్ తండ్రి వద్ద మారాం చేసి ఈ పర్యటన పెట్టించుకున్నట్లుగా ఉన్నది తప్ప ఇందులో ఎలాంటి విజ్ఞత లేదని పలువురు భావిస్తున్నారు. ఇతర నేతలను అనుకరించడానికి ప్రయత్నిస్తే.. సొంత అస్తిత్వం కోల్పోవడం గ్యారంటీ అనే సంగతిని లోకేష్ తెలుసుకోవాలని పలువురు సలహా ఇస్తున్నారు.

గతంలో డాలియాన్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ వెళ్లారు. మరో సందర్భంలో దావోస్ లోనే జరిగిన సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అధికారిక అతిథిగా హాజరయ్యారు. ఈసారి మాత్రం.. కేటీఆర్ అధికారిక అతిథిగానే వెళ్తున్నారు గానీ.. నారా లోకేష్.. ఆ ఆపర్ ను కూడా కొనుక్కుని మరీ హాజరవుతున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.