Advertisement


Home > Politics - Gossip
ప్రజారాజ్యాన్ని అమ్ముకున్నదెవరు? నమ్ముకున్నదెవరు?

ప్రజారాజ్యం ఓ విఫలయత్నం. ఆ సంగతి ఇప్పుడు కొత్తగా చెప్పనక్కరలేదు. అందరూ అంగీకరించినదే. అయితే అప్పట్లో యువరాజ్యం, ఇప్పుడు జనసేన (పవన్‌ తరచు వల్లెవేసే గుంటూరు శేషేంద్ర శర్మ కవిసేనతో ప్రభావితమై వచ్చిన పేరు) అధిపతి పవన్‌ కళ్యాణ్‌ కొత్త విషయం చాటింపు వేస్తున్నారు. ఎక్కడ ప్రజారాజ్యం విఫలయత్నం జనసేన మీద పడుతుందో అని ఆయన భయం. గతంలో ఆయనే ఈ సంగతి చాలాసార్లు చెప్పారు. ప్రజారాజ్యం వైఫల్యం తనను వెనక్కు లాగుతోందని ఆయన అన్యాపదేశంగా చాలాసార్లు చెప్పారు. కానీ ఇప్పుడు కొత్తగా ప్రజారాజ్యం వైఫల్యం కాదు, కొందరి వెన్నుపోటు అంటున్నారు.

అంటే ఆ విధంగా ప్రజారాజ్యానికి సింపతీ తెప్పించి, దానిని జనసేనకు వాడుకోవడానికి పవన్‌ ఎత్తువేసారని కొత్తగా చెప్పనక్కరలేదు. ఆయన వరకు ఆయన ఎత్తుగడ బాగానే వుంది. కానీ ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి ప్రకటించడానికి ముందు నుంచే ఎంతోమంది ఆయన సామాజికవర్గానికి చెందినవారు ముందుకు దూకారు. తమ తమ ప్రాంతాల్లో తమకు టికెట్‌లు వస్తాయని ఆశించి లక్షలు ఖర్చుచేసేసారు. కొందరికి టికెట్‌లు వచ్చాయి. మరి కొందరికి రాలేదు. ప్రజారాజ్యంలో టికెట్‌లు అమ్ముకున్నారని అప్పట్లో బలమైన ఆరోపణలు కూడా వినిపించాయి. ఒక్కసారి అప్పటి దినపత్రికలు తీస్తే, ఎవరు కలెక్షన్‌ కింగ్‌లో? పార్టీ పెడుతూనే ఎవరు అవినీతి చేసారో? టికెట్‌లు అమ్మకున్నారో? బోలెడు ఆరోపణలు కనిపిస్తాయి.

మండుతున్న కాపులు అప్పట్లో ప్రజారాజ్యంలోకి వచ్చి డబ్బులు తగలేసుకుని, ఆ తరువాత వేరే వేరే పార్టీల్లోకి వెళ్లిన చాలామంది కాపు సామాజికవర్గ జనాలకు ఇప్పుడు మండుకువస్తోంది. పార్టీ పెట్టింది చిరంజీవి. టికెట్‌లు అమ్ముకునే అవకాశం ఎవరికి వుంటుంది? పార్టీని కాంగ్రెస్‌కు అందించింది ఎవరు? దానివల్ల ఎంపీ అయింది ఎవరు? ఆపై మంత్రి హొదా వెలగబెట్టింది ఎవరు? ఇలా ప్రతిచోటా ప్రజారాజ్యం వల్ల చిరంజీవి అండ్‌ కో లాభం పొందితే, ఇప్పుడు ఎవరో వెన్నుపోటు పొడిచి ప్రజారాజ్యాన్ని విఫలయత్నం చేసారని అంటారేమిటి? పవన్‌? అని వీరు వాపోతున్నారు.

నిజంగా సైద్ధాంతిక వైఫల్యం లేదా వెన్నుపోటు అయివుంటే, చిరంజీవినే పక్కనపెట్టి, ఎవరో ఒకరు పార్టీని తీసుకుని వుండేవారు. కానీ అలా జరగలేదు కదా? పార్టీని పెట్టి కష్టపడినందుకు ఫలితం కూడా చిరంజీవే తీసుకున్నారు. చక్కగా కేంద్రమంత్రి అయ్యారు. పూర్తికాలం ఎంపీగా పదవిలో వున్నారు. తిరిగి తనకు అంత చేసిన కాంగ్రెస్‌ పార్టీని సైలెంట్‌గా వదిలేసి పక్కకు తప్పుకుని, తన సినిమాలు తాను చేసుకుంటున్నారు.

మరి ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకులు చిరంజీవిని వెన్నుపోటు లేదా ద్రోహం అని విమర్శించవచ్చు కదా? చిరు ఇలా అర్థాంతరంగా పార్టీని వదిలేస్తారని తెలిస్తే, కాంగ్రెస్‌ పార్టీకి ఆయనను మంత్రిని చేసేదా? మరి ఇలా అన్ని విధాలా తప్పు, లాభం అన్నీ చిరంజీవి వైపు వుంటే పవన్‌ ఏమిటి? ఇలా కొత్త థియరీ తీస్తారు? ఎవరూ ఎదురు మాట్లాడరు. మాట్లాడినా, ప్రస్తుతం పవన్‌ వైపు వున్న మీడియా ఆ గొంతులు వినపడనీయదనా?

-ఆర్వీ