Advertisement


Home > Politics - Gossip
వీపీ పోస్టు ఎందుకులెద్దూ : వెంకయ్యకు సలహాలు!

కేంద్రంలో చక్రం తిప్పుతూ కీలకమైన సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉండడం గొప్ప విషయమా? దేశానికి రెండో అత్యున్నత రాజ్యాంగబద్ధ పదవి అయిన ఉపరాష్ట్రపతిగా ఉండడం గొప్ప విషయమా? సాధారణంగా ఎవరైనా సరే.. ఉపరాష్ట్రపతి పదవే గొప్పదనం అనవచ్చు గాక!

కానీ ఇప్పుడు... ఆ పదవికి దాదాపుగా పాలకకూటమి ఎన్డీయే తరఫున అభ్యర్థిగా ఖరారు అయిన వెంకయ్యనాయుడుకు ఆయన సన్నిహితులు, అనుచరులు, సహనాయకుల నుంచి ప్రతికూల సంకేతాలు అందుతున్నాయి. ఉపరాష్ట్రపతి పదవి అనేది హోదాగా చెప్పుకోవడానికి తప్ప.. కేంద్రమంత్రి పదవికంటె గొప్పదేమీ కాదని ప్రస్తుత పదవిలో ఉండడమే శ్రేయస్కరమని ఆయనకు పలువురు సూచనలు చేస్తున్నట్లుగా అమరావతి సచివాలయ ప్రాంగణంలో పుకార్లు వినిపిస్తున్నాయి. 

ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోని పలువురు, వెంకయ్యనాయుడు సామాజిక వర్గానికి చెందిన వారు ఉపరాష్ట్రపతి పదవిని వద్దంటే వద్దని అభ్యంతరపెడుతున్నారట. అయితే అందుకు వీరు పైకి చెబుతున్న కారణంగా మరొకటి కూడా వినిపిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రం నుంచి వివిధ పథకాల కోసం అందే సాయం కోసం తీవ్రమైన నిరీక్షణలో ఉంటున్నది.

ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ నుంచి కేంద్రంలో కీలకంగా ఉన్న ఒక్క నాయకుడు కూడా యూనియన్ కేబినెట్ నుంచి పరిపాలనతో నిమిత్తం లేని, ప్రభావం చూపించలేని  ఉపరాష్ట్రపతి పదవిలోకి వెళ్లిపోతే.. రాష్ట్రానికి నిధుల పరంగా చాలా నష్టం జరుగుతుందని అంటున్నారట. ఉపరాష్ట్రపతిగా హుందాగా ఆ పదవిలో ఉండడమే తప్ప.. రాష్ట్రం కోసం పనిగట్టుకుని ఇప్పుడు చేస్తున్నట్లుగా కేంద్రంలోని వివిధ శాఖల నుంచి పథకాలు నిధులు రాబట్టడానికి కృషి చేయడానికి వీలుండదని వారు వాదిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయనకు పెద్ద హోదా దక్కుతున్నందుకు అసూయ పడుతున్న వారు లేరు గానీ... కేంద్రలో ఆయన లేకపోతే.. రాష్ట్రానికి నష్టం అని భయపడుతున్న వారే ఎక్కువ అని చెప్పుకుంటున్నారు.

అయితే వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వం విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏ రకంగా స్పందిస్తారనేది మాత్రం ఇంకా స్పష్టత రావడం లేదు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అయితే గనుక.. ఆ స్థానంలో ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర కేబినెట్ లో మరో కీలక మంత్రి పదవి కావాలని, దానిని తెలుగుదేశం ఎంపీలకే ఇవ్వాలని చంద్రబాబునాయుడు ఒత్తిడి చేసే అవకాశం ఉంది.

రామ్‌నాథ్ కోవింద్ విషయంలో ‘దళిత అభ్యర్థి గనుక మద్దతిస్తున్నాం’ అంటూ సన్నాయి నొక్కుల నొక్కిన తెలంగాణలోని గులాబీ పార్టీ.. వెంకయ్యనాయుడు విషయంలో కూడా మరో సాకు చెప్పి సానుకూల ధోరణినే అవలంబించవచ్చు. ఏది ఏమైనప్పటికీ సోమవారం సాయంత్రానికి ఎన్డీయే ఆయన అభ్యర్థిత్వం విషయాన్ని ఒక కొలిక్కి తెస్తే.. ఆ నిర్ణయానికి అనుగుణంగా నేతలందరూ దార్లోకి వచ్చేస్తారని అనుకోవచ్చు.