Home > Politics - Gossip
వియ్యంకుడి లబ్ధి కోసమే.. మెత్తబడ్డ ముద్రగడ!

కాపు జాతికోసం మరణించే వరకూ పాటు పడతానని, తనకు వ్యక్తిగతంగా ఏమీ వద్దని, తన జాతికి ఇచ్చిన మాటను చంద్రబాబునాయుడు వెంటనే అమల్లోకి తీసుకువస్తే చాలని.. తెదేపా సర్కారు మీద పదేపదే బహిరంగ యుద్ధాన్ని ప్రకటించిన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం హఠాత్తుగా ఎందుకు మెత్తబడిపోయారు?

మూడు నెలల గడువులోగా రిజర్వేషన్ల వ్యవహారాన్ని తేల్చేస్తానని సాక్షాత్తూ చంద్రబాబునాయుడే సుమారు రెండు నెలల నుంచి కాపులను నమ్మిస్తూ ఉండగా.. తాజాగా మళ్లీ మరో మూడు నెలల గడువును ప్రభుత్వానికి ఇస్తూ ముద్రగడ పద్మనాభం ఎందుకు మెత్తబడినట్లు? చంద్రబాబునాయుడు కాపులకోసం తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాల మీద ఆయనకు నమ్మకం పెరిగి, రిజర్వేషన్ కూడా త్వరలో వస్తుందిలే అనే సానుకూల అభిప్రాయానికి వచ్చారా లేదా? ఇలా, హఠాత్తుగా ఫ్లెక్సిబుల్ గా మారిపోవడం వెనుక మరే ఇతర కారణాలైనా ఉన్నాయా? అనే సందేహాలు ఎవ్వరికైనా కలుగుతాయి. 

అయితే  కాస్త లోతులకు వెళ్లిచూస్తే.. తన వియ్యంకుడికి వ్యాపార లబ్ధి చేకూర్చడం ముద్రగడకు ప్రథమ ప్రాధాన్యంగా మారిందని, అందుకే కాపు ఉద్యమ పోరాట జెండాను పక్కన పెట్టేసి.. అధికార పార్టీ నేతల ద్వారా వియ్యంకుడి స్వకార్యం చక్కబెట్టుకోవడానికి మెట్టు దిగివచ్చి మెత్తబడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం వియ్యంకుడి వ్యాపార లావాదేవీల కోసం ఏకంగా ఉద్యమాన్ని పణంగా పెట్టేయడం ధర్మమేనా? అనే సందేహాలు కూడా కాపుల్లో తలెత్తుతున్నాయి. 

ఇంతకూ  విషయం ఏంటంటే.. ముద్రగడ వియ్యంకుడు రవికుమార్ అనే వ్యక్తి తన రాజమండ్రిలోని భూములను రాయల్ మైన్స్ అనే సంస్థకు డెవలప్ మెంట్ నిమిత్తం అప్పగించారు. ఆ నిర్మాణ సంస్థ కూడా ప్రధానంగా కాపు వర్గానికి చెందిన వారిదే కావడం ఇక్కడ గమనార్హం. డెవలప్ మెంట్ కు తీసుకున్న సదరు సంస్థ అన్ని ఖర్చులు భరిస్తూ నిర్మాణాలు పూర్తిచేసింది.

అయితే ఈలోగా.. రవికుమార్ ఒప్పందానికి భిన్నంగా, నిర్మాణ సంస్థకు తన వాటాగా ఇవ్వవలసిన చెల్లింపులేమీ చేయకుండానే.. కొన్ని ఫ్లాట్లను విక్రయించేడం వివాదంగా మారింది. దీంతో నిర్మాణ సంస్థ కోర్టుకెళ్లింది. అయితే వ్యవహారం కోర్టులో ఉండగా.. వియ్యంకుడికి అనుకూలంగా కోర్టు వెలుపల దీనిని పరిష్కరించుకునేందుకు ముద్రగడ స్వయంగా రంగంలోకి దిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

తెలుగుదేశం పార్టీకి చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి వద్ద నిర్మాణ సంస్థకు, వియ్యంకుడికి రాజీ చర్చలు అనగానే.. ఇక వియ్యంకుడి కోసం ముద్రగడ స్వయంగా తాను కూడా వెళ్లినట్లుగా చెప్పుకుంటున్నారు. ఈ డీల్ ను వియ్యంకుడికి అనుకూలంగా అయ్యేలా చేయడం కోసం.. ముద్రగడ కాపు పోరాట జెండాను కూడా పక్కన పారేసినట్లు అనుకుంటున్నారు. అయినా కాపులకోసం సర్వం వదులుకుంటానని చెప్పిన నాయకుడు.. కేవలం ఇంత చిన్న సెటిల్మెంటు కోసం.. తన క్రెడిబిలిటీని పణంగా పెడుతున్నారేమిటా అని కాపులే ఆశ్చర్యపోతున్నారు.